03-03-2025 01:13:18 AM
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
-ఎల్బీనగర్, మార్చి 2 : బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకు తన వంతుగా కృషి చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సినీ నటుడు సుమన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో ఆదివారం సుమన్ తల్వార్ లెజెండరీ కప్ -2025 పేరిట తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వచించారు. ఈ కార్యక్రమానికి హీరో సుమన్ తోపాటు మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని చెప్పారు.
క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు. ఆటలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని, ఇతర ఆటలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పోరట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆటలో గెలిచినా ఓడినా ఒకేవిధంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.