23-04-2025 06:08:55 PM
ఐపీఎల్-2025 18వ సీజన్ లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో బాధిత కుటుంబాలకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) సంఘీభావం తెలపనుంది. ఇందులో భాగంగా మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఒక నిమిషం పాటు ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు మౌనం పాటించనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఈరోజు జరిగే మ్యాచ్ లో ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు అంపైర్లు కూడా ధరించనున్నారు. ఈరోజు మ్యాచ్ లో ఎటువంటి బాణసంచా సంబరాలు కాల్చకుండా, అలాగే చీర్ లీడర్స్ కు అనుమతి లేకుండా నిర్వహించాలని బీసీసీఐ పేర్కొంది. కాగా, ఇప్పటికే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య బాధితులకు మద్దతుగా నిలిచారు.