03-04-2025 01:28:25 AM
బీసీలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
9వ షెడ్యూల్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం
ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందోని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ ఆరోపించారు. బీసీలను మరోసారి మోసం చేయడా నికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పూర్తి మోసపూరితమైందని ఓ ప్రకటనలో లక్ష్మణ్ పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వేదికగా పోరు గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ మరో రాజకీయ డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ ఎప్పుడూ న్యాయం చేయలేదన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ బీసీలకు కేవలం 22 టిక్కెట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రాష్ర్ట ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్లను పెంచే పూర్తి అధికారముందన్నారు. 9వ షెడ్యూల్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరే బీసీ మంత్రులా..
బీసీలకు న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్‌కు ఉంటే తమ ప్రభుత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. మంత్రివర్గంలో కేవలం ఇద్దరు బీసీలకు మాత్రమే ఎందుకు అవకాశం కల్పించారని నిలదీశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే అశాస్త్రీయంగా కుల గణన నిర్వహించి 51 శాతం ఉన్న బీసీల సంఖ్యను 46శాతానికి తగ్గించిందని ఆరోపించారు.
బీసీ జాబితాలో 10శాతం ముస్లింలను చేర్చడం ద్వారా అసలైన బీసీలకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని రాష్ట్రంలోని బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ కోరారు. బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నా ఆ నెపాన్ని కేంద్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.