calender_icon.png 25 November, 2024 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభిప్రాయం మేరకే బీసీ రిజర్వేషన్లు

31-10-2024 02:09:32 AM

  1. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  2. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ

సంగారెడ్డి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రజాభిప్రాయం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ అన్నారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణను నవంబర్ 13వ తేదీ వరకు పూర్తిచేసి డిసెంబర్ 9వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.

నవంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ సర్వేలో అన్ని వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి,కలెక్టర్ క్రాంతి వల్లూరు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ ప్రొటోకాల్ పాటించరా?

బీసీ కమిషన్ సభ్యులు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే ప్రొటోకాల్ పాటించలేదని చైర్మన్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌కు చైర్మన్ నిరంజన్, సభ్యులు రాగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌వో పద్మజారాణి, సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు.

అయితే, కలెక్టర్ స్వాగతం పలికేందుకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎందుకు రాలేదని అధికారులను  ప్రశ్నించారు. ప్రొటోకాల్ అమలు చేయని కలెక్టర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.