19-04-2025 12:17:24 AM
9వ షెడ్యూల్లో చేర్చాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీసీల మహాధర్నా
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేష న్ బిల్లును పార్లమెంటులో ఆమోందించి 9వ షెడ్యూల్లో చేర్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ‘బీసీల మహాధర్నా‘ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ధర్నాకు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఓబీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, బీసీ సంఘాల నేతలు కోలా జనార్దన్ గౌడ్, ఓరుగంటి వెంకటేశం తదితరులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ దేశవ్యాప్త జనాభా లెక్కల్లో సమగ్ర కుల గణన నిర్వహించాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యలు మాట్లాడుతూ గత 75 ఏళ్లుగా బీసీలు అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో ఆమోదించి బిల్లు పెడితేనే న్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టేంతవరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో బిసి సంఘాల నేతలు నంద గోపాల్, పగిళ్ల సతీష్, సుధాకర్, రాందేవ్ మోడీ, మట్ట జయంతి తదితర నాయకులు పాల్గొన్నారు.