calender_icon.png 18 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటాకు భేరి

18-03-2025 01:32:50 AM

  1. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
  2. ఒక బిల్లు విద్య, ఉద్యోగాలు.. 
  3. మరో బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై.. 
  4. పార్టీలకు అతీతంగా రెండు బిల్లులకు మద్దతు
  5. పార్లమెంట్‌లో ఆమోదం సాధిద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి 
  6. రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్లు అమలుచేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
  7. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని

అపాయింట్‌మెంట్ ఇవ్వండి

ప్రధాని మోదీకి సీఎం లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి  అపాయింట్‌మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐ ఎం, సీపీఐ నాయకులతో కలిసి అఖిలపక్షంగా తను ఢిల్లీకి వస్తానని, అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే రెండు బిల్లులను శాసనసభలో ఆమోదించిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నారు. 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ సహా బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపాయి.

దీంతో శాసనసభలో బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా బిల్లులకు ఆమోదం తెలిపిన అన్ని పార్టీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం సభనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీల లెక్క తేలిందని, రాష్ట్ర జనాభాలో 56.36 శాతం బీసీలు ఉన్నట్లు వెల్లడించారు.

వారికి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఈ బిల్లులు ప్రవేశపెట్టామని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా రెండు బిల్లులకు ఆమోదం తెలపడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. బిల్లులకు పార్లమెంట్‌లో ఆమోదం సంపాదించేందుకు త్వర లో అఖిల పక్షాలు కలిసి ప్రధాని మోదీ వద్దకు వెళ్దామని పిలుపునిచ్చారు.

అందు కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని పార్టీల నేతలు ముందుకు వస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇక ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని సైతం కలుద్దామన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ సంగతి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చూసుకుంటారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

బీసీలకు బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి 

రెండు బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని, ఇదే ఒరవడిలో పార్లమెం ట్‌లో బిల్లులకు ఆమోదం తీసుకొచ్చేందుకు పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్య, ఉద్యో గాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన సాకారమైతే బీసీలు ఎంతో సంతోషిస్తారని, బీసీలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలని బీఆర్‌ఎస్ కోరుకుంటున్నదని తెలిపారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వెనుక 100 ఎంపీల వరకు ఉన్నారని, పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం రాహుల్‌గాంధీ పూనుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ప్ర భుత్వంలో నాటి సీఎం కేసీఆర్‌గా మా ర్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారని, మద్యం షాపుల్లో గౌడ కులస్థు లకు తగినంత రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు.

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పా టు బీసీ సబ్‌ప్లాన్ సైతం అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వా ర్షిక బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు 

బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తీసుకువచ్చే బాధ్యత సీఎందే..

బీసీ రిజర్వేషన్ల బిల్లులను బీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని, ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదింపజేసే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిదేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమ లాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రా లు బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లను ప్రతిపాదించి విఫలమయ్యాయని, కానీ.. ఒక్క తమిళనాడు మాత్రం బీసీలకు 69 శా తం రిజర్వేషన్లు సాధించుకున్నదని తెలిపా రు. తమిళనాడు కులాల ప్రతిపాదికన బీసీ కమిషన్ సర్వే చేసిందని, ఆ సర్వే ఏడాది పాటు కొనసాగిందని గుర్తుచేశారు.

-బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం 

 కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ  హనుమంతరావు కొనియాడారు.  కాం గ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీసీలకు న్యాయం చేయాలనే  గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించారని గుర్తుచేశారు. అందు కు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. 

గాంధీభవన్‌లో ఆయన పార్టీ నేత అల్లం భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లులకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పుడే బీసీల్లో పెద్ద కదలిక వచ్చిందని అభిప్రాయపడ్డారు.  

-పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిథ్యం ఉండాలి 

- కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రా తినిథ్యం కల్పించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమవారం  అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 

జానారెరెడ్డి కొడుకుకే క్లాస్ తీసుకుంటే.. అందరు సెట్టయ్యారు 

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలయదని, అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందని, లేకపోతే లేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నా రు. మంత్రివర్గ విస్తరణలో తననకు అవకాశం వస్తుందా..? రాదా..? అనేది ఇప్పుడే చెప్పలేనని వెల్లడించారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందని ఎవరైనా ఊహించారా..? తాను కష్టపడి పని చేసి ఇక్కడి వరకు వచ్చానని, తనకు లాబీయింగ్ చేయడం రాదన్నారు. అయితే మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డికి సీఎం క్లాస్ తీసుకోవడంతో మిగతా ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తపడడారని అన్నారు. జానారెడ్డి కొడుక్కే క్లాస్ పీకితే ఇక తమ పరిస్థితి ఏంటనీ చమత్కరించారు.

- కాంగ్రెస్  ఎమ్మెల్యే బాలూనాయక్ 

రాష్ట్రపరిధిలోకి వచ్చే రిజర్వేషన్లు అమలు చేయాలి..

బీసీ రిజర్వేషన్ల  బిల్లులకు బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అయితే.. ఆ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించే వరకు రిజర్వేషన్లు ఆలస్యమవుతాయని, ఈలోపు ప్రభుత్వం రాష్ట్రపరిధిలోకి వచ్చే అంశాలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. జడ్జీల నియామకంలో కొలీజయానికి పంపే పేర్లలో బీసీలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు.

22 ఓట్లు ఉన్న ఓ ఇంట్లో ఐదు పదవులు ఉన్నాయని, నల్లగొండ జిల్లా నేతలకు ఒక్కో ఇంట్లోనే రెండు, మూడు పదవులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ భవనాల కేటాయింపుల్లోనూ బీసీలకు  అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటితో పెద్దగా ప్రయోజనం లేకపోయిందన్నారు.

 ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు తీసుకురావాలి.. 

విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర పరిధిలోకి వచ్చే రిజర్వేషన్లను అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో నానాటికీ ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయని, కనుక ప్రభుత్వం ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

-సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే ..

బీసీ రిజర్లేషన్లపై అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిందని, ఆ డిక్లరేషన్ ప్రకారమే తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియకు గతేడాది ఫిబ్రవరి 4న శ్రీకారం చుట్టామని, ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.

ప్రక్రియ శ్రీకారం చుట్టిన రోజును ఏటా సోషల్ జస్టిస్ డేగా నిర్ణయించామని, దీనిలో భాగంగా ఏటా ఫిబ్రవరి 4న వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 2017లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మా నం చేసిందని, ఆ బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిందని గుర్తుచేశారు.

తాజాగా తమ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినందున, పాత బిల్లును ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం సీఎం బీసీ రిజర్వేషన్లపై చర్చించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ సభ్యులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు.