- కమలదళం నాయక రేసులో ముందున్న ఎంపీ ఈటల
- నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం
పెద్ది విజయ భాస్కర్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేతను అధిష్ఠానం ఖరారు చేసిందని తెలు స్తోంది. బీసీ అయిఉండి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉన్న వారికి అధ్యక్ష పదవి కేటాయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ఆ లెక్కల మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్‌కు అవకాశం ఉండగా.. ఈటలకు ఉన్న అనుభవం, రాజకీయంగా ఆయ నకున్న చరిష్మా ఇప్పుడు అక్కరకు వచ్చేలా కనిపిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఆగస్టులోనే దాదాపుగా అధ్యక్ష నియామకం పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రాష్ర్టంలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలను అధిష్ఠానం తీసుకున్నట్లు తెలుస్తోంది. సింహభాగం ఈటల పేరే సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. దాంతో కొత్త బీజేపీ అధ్యక్షుడు ఈటలనే అనే చర్చ చక్కర్లు కొడుతోంది.
భారంగా మారిన అధ్యక్ష పదవి
కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కీలకమైన బొగ్గు, గనుల శాఖను నిర్వహిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అధిష్ఠా నం ఆయనను జమ్ముకశ్మీర్ పార్టీ ఇంచార్జిగా కూడా నియమించింది. కేంద్ర మంత్రిగానే తనపై పెద్దబాధ్యతలు ఉన్నాయని... అందుకే రాష్ర్ట అధ్యక్షునిగా తాను కొనసాగేందుకు సుముఖంగా లేనని క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలోనే పేర్కొన్నారు. తెలంగాణకు ఆయన సమయం ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యం లో సాధ్యమైనంత త్వరగా పార్టీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం నిర్ణయించింది.
స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొనేది ఎలా..
త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ర్టంలో 18 శాతం ఓటింగ్ సాధించింది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 35 శాతంతో సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 119 స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకుగాను ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుని అధికార కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది.
గత రెండు ఎన్నికల్లో భారీగా పెరిగిన ఓటింగ్‌ను నిలబెట్టుకుంటేనే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సాధించాలంటే బీజేపీ ఎంతోబలంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి తరుణంలో పార్టీకి అధ్యక్షు డు లేకుంటే గ్రామీణ స్థాయిలో ఏమాత్రం ముందుకు పోయే అవకాశం కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడం పక్కన పెడితే... బీఆర్‌ఎస్ బీజేపీని దాటి సర్పంచ్ పదవులు కైవసం చేసుకుంటే ఇప్పటివరకు పెరిగిన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఆలస్యంపై పార్టీ నేతల్లోనే అసంతృప్తి
పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఫలితంగా పార్టీని నడిపించేవారు లేక స్థానిక సంస్థలకు ఇబ్బందులు తప్పేలా లేవని పలువురు స్థానిక నేతలు జాతీయ పార్టీ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. రాష్ర్టం నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధిష్ఠానం తెలంగాణకు కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బీజేఎల్పీ నేతగా ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని జాతీయ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించారని పార్టీ వర్గాల భోగట్టా. పార్టీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండాలని కూడా నిబంధన పెట్టుకున్నారని సమాచారం.
బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన బీజేపీ... కనీసం బీజేఎల్పీ నేతగా కూడా బీసీని చేయకపోవడం పట్ల పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకే కచ్చితంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్ష పదవి వరిస్తుందని పార్టీలో కీలకమైన వ్యక్తులు తెలిపారు.
ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులలో పార్టీ దృష్టిలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, పాయల్ శంకర్ మాత్రమే ఉన్నారు. వీరిలో సీనియారిటీ, విశ్వసనీయత, ప్రజల్లో ఉన్న చరిష్మా, వివాదరహితంగా ఉండడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే అధిష్ఠానం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయన నియామకం పూర్తవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.