- ఆహారంలో రాళ్లు, రాగి జావాలో పురుగులు
- కంపు కొడుతున్న మరుగుదొడ్లు
- నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 4: రాష్ట్రంలో పలు బీసీ గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది. సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు సంక్షేమ గురుకులాల్లో పిల్లలకు విద్యా, ఆరోగ్య, ఆహార భద్రత ఉండేది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందనే భరోసాతో ఉండేవారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఉండేవి. అక్కడ సీట్లు కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సిఫారసులు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. బీసీ గురుకులాల్లో సరైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులే ఆరోపిస్తున్నారు.
రోడ్డుపైకి వచ్చి ఆందోళన
ఎంజేపీఎస్ చార్మినార్, ముషీరాబాద్‌కు చెందిన బీసీ గురుకులం రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఉంది. 6 నుంచి 12వ తరగతికి చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు ఉంటారు. తాము అనేక సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్థులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో పెట్టే రాగి జావాలో పురుగులు ఉంటున్నాయని తెలిపారు.
అదే విధంగా అన్నంలో చిన్న చిన్న రాళ్లు ఉంటున్నాయని, మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణమని, కంపుకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సరిగా పాఠాలు చెప్పడం లేదని, ఈ విషయంపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కొడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ బీసీ గురుకులాన్ని ఓ భవనాన్ని లీజ్‌కు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఇది చాలా పురాతమైన భవనం.
ఆ హాస్టల్ భవనానికి ఉన్న కిటికీలకు అద్దాలు లేకపోవడంతో బస్తాలను చుట్టారు. భవనం పలుచోట్ల పెచ్చులూడి కనిపిస్తోంది. భవనం నిర్మించిన క్రమంలో పిల్లర్ల కింద పోసిన మట్టి కుంగిపోతోంది. విద్యార్థుల ఆందోళనతో హాస్టల్‌లోకి వెళ్లి చూద్దామని విద్యార్థుల తల్లిదం డ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి వెళ్లారు. హాస్టల్ లోపలికి ఎవరికీ అనుమతి లేదని అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను కూడా హాస్టల్ లోపలికి అనుమతించలేదు.
స్పందించిన అధికారులు
విద్యార్థుల ఆందోళనకు సంబంధించి హాస్టల్ అధికారుల వివరణ కోరగా.. బీసీ గురుకులాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ నారాయణరెడ్డి స్పందించారు. దీపావళి పండుగ రోజు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా వెళ్లి పటాకులు తీసుకొచ్చి కాల్చారని, దీంతో తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో విద్యార్థులు ఆందోళన చేశారన్నారు. అదేవిధంగా ఇక్కడ కొందరు విద్యార్థులు సరిగా చదవకపోవడంతో పాటు గ్యాంగ్‌లుగా ఏర్పడి మిగతా విద్యార్థులను చదవకుండా చేస్తున్నారని పలువురు అధికారులు తెలిపారు.