calender_icon.png 25 October, 2024 | 4:00 AM

రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి

15-07-2024 12:27:26 AM

ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): రాజ్యాధికారంతోనే  అన్నిరం గాల్లో బీసీల అభివృద్ధి జరుగుతుందని, బీసీలకు సబ్సిడీలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు అధ్యక్షతన బీసీ సమాజం అభివృద్ధి  కర్తవ్యం అనే అంశంపై జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న మోదీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. గత బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాలని మోదీని అడిగితే రూ.2వేల కోట్లు కేటాయిం చారని ఎద్దేవా చేశారు.

విద్య, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో బీసీలకు సరైన భాగస్వామ్యం దక్కలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల పోస్టు ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయమైన వాటా దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో 6వేల ప్రభుత్వ సంక్షేమ, గురుకుల హాస్టళ్లున్నా సొంత భవనాలు లేక ఎక్కువ శాతం ప్రైవేటు భవనాల్లోనే నిర్వహించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెబుతుంటే.. తెలంగాణ మంత్రి వర్గంలో మాత్రం బీసీలకు సముచిత స్థానం దక్కలేదన్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. సామాజిక అసమానతలపై మహాత్మా జ్యోతిరావుపూలే పోరాటాన్ని ప్రారంభిస్తే అంబేద్కర్ కొనసాగించారని చెప్పారు. బీసీలకు సబ్సిడీలు, చేతివృత్తుల వారికి ముడి సరుకులు ఇవ్వాలని ప్రభు త్వానికి సూచించారు.

బీసీలకు న్యాయమైన వాటా కోసం బీసీ సబ్‌ప్లాన్ ఉన్నదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి కల్పన, వనరుల పంపిణీలో అన్యాయం జరుగుతోందన్నారు. నూతన విద్యావిధానం, ప్రైవేటు విద్య పెరుగుతుండడంతో పేదలు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లో పలువురు నీట్, సివిల్‌సర్వీస్‌ల్లో లబ్ధిపొందారని, బీసీలకు వాటా ప్రకారం రిజర్వేషన్లు దక్కకపోవడం వల్ల అన్యాయం జరుగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. సమావేశంలో తెలంగాణ మేధావుల సంఘం కో ఆర్డినేటర్ నాగుల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, ప్రొ. ప్రభంజన్, గోపి బోయ పాల్గొన్నారు.