బిల్లు ప్రవేశపెట్టకపోతే ఢిల్లీని ముట్టడిస్తాం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీల డిమాండ్లపై పార్లమెంట్ సమావేశాల్లో రెండు రోజులపాటు చర్చించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తే సహించమని ఆయన హెచ్చరించారు. న్యూఢిల్లీలోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ జాతీయ సెమినార్‌లో జాజుల మాట్లాడుతూ.. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల పెంపు, తదితర డిమాండ్లపై చర్చించాలని డిమాండ్ చేశారు.
29 రాష్ట్రాల్లో ఓబీసీ ఉద్యమం బలోపేతానికి దేశవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టి ఆరు నెలల్లో లక్ష మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిరి దేశవ్యాప్తంగా సమగ్ర గణన జరిపి బీసీలకు విద్య, ఉద్యోగ ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం వాటా కల్పించాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సూచించారు.
సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ర్ట అధ్యక్షుడు శంకర్రావు, గోవా, ఢిల్లీ అధ్యక్షులు మధునాయక్, ఆన్సర్ రాజ్, వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ నేతలు గణేశ్‌చారి, బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్‌గౌడ్, పాండు కురుమ, దానకర్ణ చారి, చెన్నయ్య, నాగమల్లేశ్వరరావు, జాజుల లింగయ్య, శ్రీనివాస్‌గౌడ్, నరసింహనాయక్ పాల్గొన్నారు.