07-02-2025 12:52:29 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ కులగణన సరిదిద్దే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభు త్వాన్ని హెచ్చరించారు. ఈ నెల రెండో వారంలో బీసీ కులగణన రణభేరి పేరుతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సమగ్ర కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నేతలు, మేధావులు గురువారం బేగంపేటలో భవిష్యత్ కార్యచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్, బీసీ కుల సంఘాల జేఈసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి తదితర బీసీ సంఘాల నేతలు హజరయ్యారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కులగణన రిపోర్ట్‌పై బీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. నివేదికను పునఃసమీక్షిస్తానంటేనే ప్రభుత్వంతో చర్చిస్తామని జాజుల స్పష్టం చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో బీసీ జనాభాను తక్కువగా చూపించి, బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శుక్రవారం లేఖ రాయనున్నట్టు తెలిపారు. 9న రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, బీసీ సంఘాలు చెప్పే లెక్కలలో ‘ఏది నిజం’ అనే అంశంపై బీసీ ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
రెండో వారంలో బీసీ కులగణన రణభేరి పేరుతో వేలాదిమందితో చలో హైదరాబాద్ చేపట్టేందుకు సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు. ఫిబ్రవరి మూడో వారం నుంచి జిల్లాల్లో పర్యటించి బీసీలను సంఘటితం చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సింగం నగేశ్, భాస్కర్, బాలవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.