- అసెంబ్లీలో బీసీల గొంతు నొక్కేశారు
- కులగణనతో బీసీలకు ముమ్మాటికీ అన్యాయమే
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలను కుంటున్నామని.. కానీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల సాధ్యపడటం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. బీసీ కులగణన కోసం ఒక తీర్మానం చేయడానికి అసెంబ్లీ సమావేశం పెట్టాల్సిన అవసరముందా అని ప్రశ్నించారు.
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన సీఎం.. ఆ విషయాన్ని అసెంబ్లీలో కాకుండా వారి పార్టీ కార్యాలయంలో వెల్లడిస్తే సరిపోయేదన్నారు. ప్రభుత్వ తీరుపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందన్నారు. అసెంబ్లీ వేదికగా బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు.
బీసీల జనాభా తగ్గించి చూపడంపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదన్నారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌లో అధికారికంగా కులగణన డేటాను అందుబాటులో ఉంచిందని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆ డేటా ప్రామాణికం కాదని అంటున్నారని తెలిపారు.