21-04-2025 01:53:46 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంతో మేము ఒంటరిగా పోటీ పడుతున్నాం
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీబీపీల మధ్యే పోటీ నెలకొందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యంగ్యస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో 3 బీబీపీలున్నాయని.. ఇందులో భాయ్.. భాయ్ పార్టీగా ఎంఐఎం, బాప్, బేటేకే పార్టీగా బీఆర్‌ఎస్, బేటా బేటీకి పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎంఐఎం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ఏకమై కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీపడి పనిచేస్తున్నాయని విమర్శించారు.
పార్టీ పేరులోనే ముస్లింల ఐక్యత అని పెట్టుకున్న ఎంఐఎం.. తాము లౌకికవాదులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తాము సెక్యులర్ అని చెప్పుకొనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. ఎంఐఎంతో అంటకాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీలో లేదని ప్రశ్నించారు.
ఎంఐఎంకు మద్దతు ఇచ్చేందుకే ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలబడటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్ లేకుంటే మనుగడ సాగించే పరిస్థితి లేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధులమని చెప్పేందుకు హక్కులేదని, భవిష్యత్తులోనూ ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు వారికి అర్హత లేదన్నారు.
కేసీఆర్ రోగం ఒవైసీకి అంటుకుంది..
కేసీఆర్ లాంటి రోగం ఒవైసీకి కూడా అంటుకుందని అందుకే ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కిషన్‌రెడ్డిపై చేసిన చౌకబారు వ్యాఖ్యలు వారి పార్టీ సంస్కృతికి నిదర్శనమన్నారు. అంబేద్కర్ గురించి వల్లెవేసే ఎంఐఎంకు తెలియని విషయం సీఏఏ తీసుకురావాలని ఆయన భావించారని అన్నారు.
మజ్లిస్‌లా దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాలని అంబేద్కర్ కోరుకోలేదన్నారు. యూసీసీ, సీఏఏ, ఆర్టికల్ 370 రద్దుకు అంబేద్కర్ అనుకూలంగా ఉంటే కాంగ్రెస్, మజ్లిస్ వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం వల్ల పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. వక్ఫ్ అనేది మతానికి సంబంధించిన అంశం కాదని తేల్చిచెప్పారు.