calender_icon.png 22 December, 2024 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రణరంగం

13-09-2024 12:45:47 AM

  • పాడి కౌశిక్‌రెడ్డి x అరికెపూడి గాంధీ
  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల దాదాగిరీ
  • గాంధీ ఇంటిపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్
  • నేనే వస్తానంటూ గాంధీ ప్రతి సవాల్
  • కౌశిక్ ఇంటిపై రాళ్లు, గుడ్లతో దాడి
  • చెప్పులతో తిరగబడిన కౌశిక్ అనుచరులు 
  • నేడు ప్రతిదాడి తప్పదన్న కౌశిక్ 
  • నేను లోకల్.. ఎక్కడి నుంచో వచ్చినవాడిని కాదని వ్యాఖ్య
  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన  కౌశిక్‌ను అరెస్టు చేయాలి: గాంధీ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి/కూకట్‌పల్లి/ రాజేంద్రనగర్: అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్లు హైదరాబాద్‌లో గురువారం ఉద్రిక్తతకు దారి తీశాయి. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసరగా, తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని ప్రకటించిన గాంధీ..

అన్నట్టుగానే గురువారం అన అనుచర గణంతో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపై అరికెపూడి అనుచరులు రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. కౌశిక్ అనుచరులు ఎదురుదాడికి దిగి చెప్పులు విసరటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గొడవ జరిగే ప్రమాదముందని తెలిసినా ఉదయం నుంచి సైలెంట్‌గా ఉన్న పోలీసులు మధ్యాహ్నం తేరుకొని అరికెపూడిని అదుపులోకి తీసుకొన్నారు. దాడిని నిరసిస్తూ కౌశిక్‌రెడ్డి తన పార్టీ సహచర ఎమ్మెల్యేలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారికి కూడా అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఆంధ్రా, తెలంగాణ ప్రాంతీయాభిమానం వైపు మళ్లటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 

సవాల్, ప్రతిసవాల్ 

బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనవాయితీగా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని ప్రభుత్వం అరికెపూడికి కట్టబెట్టింది. ఈ పదవిని పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిపై స్పందించిన గాంధీ తాను ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని ప్రకటించడంతో వివాదం మొదలైంది.

గాంధీ ప్రకటనపై స్పందించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆయన బీఆర్‌ఎస్‌లో ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని, లేదంటే తానే గాంధీ ఇంటికి గురువారం ఉదయం 11 గంటలకు వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానని బుధవారం సవాల్ విసిరారు. అంతేకాదు బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు గాజులు, చీరలు పంపుతానని మీడియా ముందు ప్రకటించాడు. దీంతో పార్టీ ఫిరాయింపులు, పీఏసీ చైర్మన్ ఎంపిక వ్యవహారం కాస్తా పాడి కౌశిక్‌రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ అన్నట్లుగా మారింది.  

కౌశిక్ ఇంటిపై గాంధీ దాడి

గురువారం ఉదయం 11 గంటలకు కౌశిక్‌రెడ్డి మరోసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల హౌస్ అరెస్ట్‌లతో బయటికి రాలేని పరిస్థితి ఉందని, శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానని ప్రకటించారు. కౌశిక్‌రెడ్డి సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న గాంధీ తానే కౌశిక్‌రెడ్డి ఇంటికి వస్తానంటూ సవాల్ విసరడంతో పాటు గురువారం మధ్యాహ్నం సమయంలో తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

అతని అనుచరులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కౌశిక్‌రెడ్డి ఇంటి ముందుకు దూసుకొచ్చారు. ఎమ్మెల్యే గాంధీని కౌశిక్ ఇంటి ముందు పోలీసులు అడ్డుకున్నప్పటికీ అతని అనుచరులు, కాంగ్రెస్ నాయకులు టమాటాలు, కోడిగుడ్లు, పూలకుండీలు, రాళ్లతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు ఇంటిలోని పని మనుషులకు, కౌశిక్ రెడ్డి మామకు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటిని చుట్టుముట్టి దాడులకు తెగబడ్డారు. అప్పటికే అక్కడికి చేరుకొన్న కౌశిక్‌రెడ్డి అనుచరులు గాంధీ అనుచరులపై చెప్పులు విసిరారు. ఇరువర్గాల దాడులు, బాహాబాహీలతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. తన సత్తా ఏమిటో శుక్రవారం చూపెడతానని పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించడంతో కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు పెంచారు. 

గాంధీ నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి 

అరికెపూడి గాంధీ తనపై హత్యాయత్నం చేశారని పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. నాలుగేండ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అప్పుడు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. తాను బీఆర్‌ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అదే పార్టీలో కొనసాగుతన్నానని, గాంధీలాగా రోజుకో పార్టీ మారే వ్యక్తిని కాదని అన్నారు. చంద్రబాబును, కేసీఆర్‌ను మోసం చేసిన గాంధీ పెద్ద బ్రోకర్ అని ఆరోపించారు. ‘నేను తెలంగాణ గడ్డమీద పుట్టిన నిజమైన తెలంగాణవాదిని.

నీలా (గాంధీ) ఎక్కడి నుంచో వచ్చినవాడిని కాదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గాంధీ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. నేను 39 ఏళ్ల యువకుడిని. గాంధీ 69 ఏళ్ల ముసలోడు. నీ దమ్ము నా దమ్ము తేలాలి అంటే మనం ఇద్దరం తేల్చుకోవాలి. అంతేకానీ మందీ మార్బలంతో వచ్చి హల్‌చల్ చేసేంత చేతగానివాన్ని కాదు. వ్యక్తిగత స్వార్థం, భూ పంచాయితీల కోసమే గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. చీరలు, గాజుల సంస్కారం నేర్పింది సీఎం రేవంత్‌రెడ్డే. గాంధీ ఏ పార్టీ నుంచి పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారో చెప్పాలి.

నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ తిరిగి సీఎం కావడం ఖాయం. గాంధీ ఇంటికి వెళ్తానంటే నన్ను పోలీసులు నిర్బంధించారు. గాంధీని మాత్రం నన్ను హత్య చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పంపారు. గాంధీ పార్టీ మారనప్పుడు బీఆర్‌ఎస్ జెండా పట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం? శుక్రవారం ఉదయం 11 గంటలకు శంభీపూర్ రాజు నివాసం నుంచి బయలుదేరి గాంధీ నివాసానికి వెళ్తాం. గ్రేటర్‌లోని ప్రతి బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త గాంధీ ఇంటికి వెళ్లి టిఫిన్ చేద్దాం’ అని పిలుపునిచ్చారు. 

కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్: గాంధీ

పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నే మోసం చేశాడని అరికెపూడి గాంధీ ఆరోపించారు. ‘కౌశిక్‌రెడ్డీ.. నువ్వు ఒక బ్రోకర్‌వి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి పార్టీని భ్రష్టు పట్టించి కేసీఆర్‌ను మోసం చేశావు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని బీఆర్‌ఎస్ పార్టీలో చేర్పిస్తానని బ్రోకర్ పని చేసే నువ్వు.. నా ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే చూస్తూ ఊరుకోను. కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు ఈ విధంగా మాట్లాడితే స్వాగతించేవాడిని. నాతోటి శాసనసభ్యులు అడిగితే సమాధానం చెప్పేవాడిని.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లి ప్రజలు నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నా నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్తా. కానీ కౌశిక్‌రెడ్డి లాంటి బ్రోకర్లకు, లోఫర్లకు, చీటర్లకు జవాబు చెప్పే అవసరం నాకు లేదు’ అని అన్నారు. పోలీసుల అదుపులో నుంచి విడుదలైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పార్టీ వైఖరి అయితే.. బీఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలి. లేదా కౌశిక్‌రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలైతే ఆయనను వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. 

కౌశిక్ ఇంటికి బీఆర్‌ఎస్ నేతలు

దాడి నేపథ్యంలో పాడి కౌశిక్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నాయకుల పరామర్శించారు. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకున్న బీఆర్ ఎస్ నాయకులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం క్రిష్ణారావు, మాగంటి గోపీనాథ్, వివేకానందగౌడ్, శంభీపూర్ రాజు, బిగాల గణేష్ గుప్తా, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి తదితరలు కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు.