25 May, 2026 | 1:17 AM

ధాన్యంలో తరుగుపై పోరు

25-05-2026 12:29 AM
  1. మిల్లర్ల కొర్రీలు, అధికారుల నిర్లక్ష్యమంటూ రైతుల ఆగ్రహం
  2. సిద్దిపేట హైవేపై రాస్తారోకో

కామారెడ్డి/నంగునూరు, మే 24 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల కొ ర్రీలు, అధికారుల నిర్లక్ష్యానికి రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట-హనుమకొండ జాతీయ రహదారిపై ఆదివారం నంగునూరు మండ లం పాలమాకుల గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై తమ పంటను దోచుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రాలకు ధాన్యం తీ సుకొచి వారాలు గడుస్తున్నా  తూకం వే యకపోవడంపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఎప్పుడేం ముంచుకొస్తుందో తెలియని అకాల వర్షాల భయంతో కొనుగోలు కేం ద్రాల వద్దే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ ధాన్యం కుప్పలను కాపాడుకోవడం తమకు  భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాలు, తేమ పేరుతో మిల్లర్లు రకరకాల కొర్రీ లు పెడుతూ, ప్రతి బస్తాకు 43.500 కిలోల చొప్పున (అనగా క్వింటాకు మూడు కిలోల తరుగు) తీస్తామంటూ మొండికేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. రైతుల ధర్నాతో హనుమకొండ- సిద్దిపేట హైవేపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాజగోపాలపేట ఎస్సై వివేక్ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

కామారెడ్డి జిల్లా అన్నారంలో..

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని అధికారులను ప్రశ్నిం చారు. వడ్ల బస్తాలను రోడ్డుపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. కాంటా పెట్టి ధాన్యాన్ని తరలిస్తామని  హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. పోలీసులు,  అధికారులు రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. కామారెడ్డి మండలంలోని టేక్ రియల్, అడ్లూరు, ఇస్రోజివాడి, గర్గుల్, ఇలిచిపూర్‌లో రైతులు ధాన్యాన్ని కాంట పెట్టాలని అధికారులను వేడుకున్నారు.