నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
- టాప్ సీడ్‌గా బరిలోకి సిన్నర్, సబలెంకా
- 25వ టైటిల్‌పై జొకోవిచ్ కన్ను
- అదృష్టం పరీక్షించుకోనున్న సుమిత్ నాగల్
మెల్‌బోర్న్: ఈ ఏడాది సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నేటి నుంచి తెరలేవనుంది. 15 రోజుల పాటు జరగనున్న టెన్నిస్ టోర్నీలో హార్డ్ కోర్టుపై ఎవరు పాగా వేస్తారన్నది ఆసక్తికరం. గతేడాది పురుషుల సింగిల్స్ చాంపియన్ జానిక్ సిన్నర్, మహిళల సింగిల్స్ చాంపియన్ ఎరీనా సబలెంకాకు టాప్ సీడింగ్ లభించింది.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. పురుషుల విభాగంలో రష్యా స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్, స్పెయిన్ స్టార్ అల్కరాజ్ రెండు, మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ స్వియాటెక్ రెండో సీడ్‌గా, 2023 యూఎస్ ఓపెన్ చాంపియన్ కోకో గాఫ్‌కు మూడో సీడ్ లభించింది.
నేడు జరగనున్న తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఆరో సీడ్ కాస్పర్ రూడ్ బరిలో ఉన్నారు. ఇక సిన్నర్, అల్కరాజ్, జొకోవిచ్ మ్యాచ్‌లు సోమవారం జరగనున్నాయి. భారత తరఫున సింగిల్స్‌లో బరిలో ఉన్న సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో 26వ ర్యాంకర్ టోమస్ మెక్‌హక్‌ను ఎదుర్కోనున్నాడు.
మొదట గ్రాస్.. తర్వాత హార్డ్ కోర్టులో
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ 1905లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 112 సార్లు టోర్నీ జరిగింది. 1905 నుంచి 1987 వరకు గ్రాస్‌కోర్టు వేదికగా మ్యాచ్‌లు జరిగేవి. అయితే 1988 నుంచి మాత్రం హార్డ్ కోర్టులో మ్యాచ్‌లను నిర్వహిస్తూ వస్తున్నారు.
1984 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్నారు. ఆ తర్వాత అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు ఈ రూల్‌ను అమలు చేశారు. అత్యధికంగా జొకోవిచ్ 10 సార్లు టైటిల్ అందుకోగా.. మహిళల సింగిల్స్‌లో మార్గరెట్ కోర్ట్ (11 సార్లు) విజేతగా నిలిచింది.
జోకో సాధించేనా?
ఇక ఒపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 25వ టైటిల్‌పై కన్నేశాడు. తన కెరీర్‌లో 10సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన జొకోవిచ్‌కు హార్డ్‌కోర్టు బాగా కలిసొచ్చింది. గతేడాది సెమీస్‌లో ఓడినప్పటికీ జొకోవిచ్ తనకు అచ్చొచ్చిన హార్డ్ కోర్టుపై గ్రాండ్‌స్లామ్ సిల్వర్ జూబ్లీ అందుకోవాలని భావిస్తున్నాడు.
గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గని జొకోవిచ్ వింబుల్డన్‌లో మాత్రం రన్నరప్‌గా నిలిచాడు. మునుపటితో పోలిస్తే జోరు తగ్గినప్పటికీ 25వ టైటిల్ అందుకొని టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నాడు. ఇక జొకోవిచ్ తొలి రౌండ్‌లో భారత సంతతి నిశేష్ బసవరెడ్డి (అమెరికా)తో తలపడనున్నాడు.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ప్రైజ్‌మనీ వివరాలు (రూపాయలు)
చాంపియన్ 30 కోట్ల 16 లక్షలు
రన్నరప్ 16 కోట్ల 37 లక్షలు
సెమీఫైనలిస్ట్ 9 కోట్ల 48 లక్షలు
క్వార్టర్ ఫైనలిస్ట్ 5 కోట్ల 73 లక్షలు
నాలుగో రౌండ్ 3 కోట్ల 62 లక్షలు
మూడో రౌండ్ 2 కోట్ల 49 లక్షలు
రెండో రౌండ్ కోటి 72 లక్షలు
తొలి రౌండ్ కోటి 13 లక్షలు