నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్
మెదక్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకున్నది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ వివాదం నానా రభసకు దారితీస్తోంది. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నర్సాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు తమ ఆధిపత్యాన్ని చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పేరుతో గొడవలకు దారి తీస్తోంది.
తాజాగా శనివారం కౌడిపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మె ల్యే సునీతారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న చెక్కులను ఎమ్మెల్యే మాత్ర మే పంపిణీ చేయాలని, బీఆర్‌ఎస్ నేతలకు ఇక్కడ ఏం పనంటూ గొడవ పడ్డారు. అలాగే జూన్‌లో కొల్చారంలో జరిగిన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ హాజరవగా.. అక్కడ కూడా ప్రొటోకాల్ గొడవ జరిగింది.
మంత్రి, ఎమ్మెల్యేకు వాగ్వాదం కార్యక్రమానికి తలనొప్పిగా మారింది. ఇటీవల వెల్దుర్తి మండలంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డిని ఆహ్వానించకుం డానే కాంగ్రెస్ నాయకులు కార్యక్రమం కానిచ్చేశారు. రెండు పార్టీల తీరుపై అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎవరి పంథా వారిదే..
నర్సాపూర్‌లో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డి తన వర్గంతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే పార్టీలో కొనసాగిన గత ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి, సునీతారె డ్డికి మధ్య వర్గపోరు కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి మదన్‌రెడ్డికి టికెట్ లభించకపోవడంతో ఆయన లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం మదన్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే సీటు సాధించకున్నా ఆధిపత్యం కొనసాగించేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉండగా పెత్తనం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందోనని జనం సైతం వాపోయే పరిస్థితి నెలకొన్నది.