న్యూయార్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన దాయాదుల పోరులో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన పోరులో టీమిండియా స్టార్లు ఆకట్టుకోలేకపోయారు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. అక్షర్ పటేల్ (20; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ రోహిత్ శర్మ (13; ఒక ఫోర్, ఒక సిక్సర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3), హార్దిక్ పాండ్యా (7), రవీంద్ర జడేజా (0) విఫలమయ్యారు.
ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల వాళ్లు ఉండాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపిచిన వ్యూహం బెడిసి కొట్టి అసలుకే ఎసరు వచ్చింది. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవుఫ్, నసీమ్ షా చెరో మూడు వికెట్లు పడగట్టగా.. అమీర్ 2, అఫ్రిది ఒక వికెట్ పడగొట్టారు. గత మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్‌లో ఘోర పరాజయం మూటగట్టుకొని సర్వత్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ బౌలర్లు.. భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేశారు. టాస్ గెలవడంతోనే మరో ఆలోచన లేకుండా పాక్ సారథి బాబర్ ఆజమ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. అందుకు తగ్గట్లే రెండో ఓవర్‌లోనే కోహ్లీ వికెట్ తీసిన నసీమ్ షా పాక్ శిబిరంలో ఆనందం నింపాడు.
మధ్యలో పంత్ పోరాటంతో ఒక దశలో టీమిండియా 89/3తో నిలవడంతో ఇక కోలుకున్నట్లే అనిపించినా.. ఆ తర్వాత మరోసారి విజృంభించిన పాక్ పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి టీమిండియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. పాక్ ఫీల్డింగ్ వైఫల్యం వల్ల మన వాళ్లకు జీవనదానాలు లభించినా.. వాటిని వినియోగించుకోలేకపోవడం విచారకరం. ఇక స్వల్ప ఛేదనలో కడపటి వార్తలు అందేసరికి పాకిస్థాన్ 11 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది.