డ్రైవర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని టోల్ ప్లాజా వద్ద నిలిపి ఉన్న లారీలో బ్యాటరీ పేలిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆపి ఉన్న లారీలో బ్యాటరీ పేలింది. ఆ సమయంలో లారీ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ రోడ్డు పక్కన పడుకొని ఉండడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. అంతకుముందు అదే లారీ నుంచి పదివేల విలువగల డీజిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్ళినట్లు లారీ డ్రైవర్ తో పాటు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. బికనూర్ టోల్ ప్లాజా వద్ద గత కొన్ని రోజులుగా దాబా హోటల్ వద్ద లారీలను నిలిపి లారీ డ్రైవర్లు నిద్రపోతుండగా లారీల్లో ఉన్న డీజిల్ గుర్తు తెలియని దుండగులు చోరీ చేస్తున్నారు. ఈ సంఘటనలు నిత్యకృత్యం అవుతున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల కనీసం 10 లారీల్లో డీజిల్ చోరీ జరుగుతుందని స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.