- తొలి టీ20లో జింబాబ్వే విజయం
టీ20 వరల్డ్ చాంపియన్స్‌కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెండోసారి పొట్టి ప్రపంచకప్ నెగ్గి జోష్ మీదున్న టీమిండియాకు ఇది ఊహించని పరాజయం. మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టినప్పటికీ బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమికి కారణమైంది. సీనియర్ల గైర్హాజరీ తొలి మ్యాచ్‌తోనే స్పష్టంగా తెలిసొచ్చింది. మరోవైపు సమిష్టి ప్రదర్శనతో జింబాబ్వే తొలి టీ20లో
శుభారంభం చేసింది.
హరారే: జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. హారారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లువ్ మదాండే (25 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్లే మదెవరె (22 బంతుల్లో 21), బ్రియాన్ బెన్నెట్ (15 బంతుల్లో 22), డియోన్ మైర్స్ (22 బంతుల్లో 23) తలా కొన్ని పరుగులు సాధించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయి 4 వికెట్లతో దుమ్మురేపాడు.
సుందర్ 2 వికెట్లు తీయగా.. ముకేశ్, అవేశ్ ఖాన్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆద్యంతం తడబడిన టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ (34 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, చటారాలు చెరో 3 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నెట్, మసకద్జ, జాంగ్వేలు తలా ఒక వికెట్ తీశారు. సికందర్ రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది.
బౌలింగ్ అదుర్స్
టాస్ గెలిచిన టీమిండియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఏంచుకుంది. గిల్ నిర్ణయానికి న్యాయం చేస్తూ మన బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి ఓవర్‌లో ఖలీల్ అహ్మద్ తేలిపోవడంతో గిల్ బంతిని స్పిన్నర్ బిష్ణోయ్‌కు అందించాడు. గిల్ నమ్మకాన్ని నిలబెడుతూ బిష్ణోయ్ ధాటిగా ఆడుతున్న మదవెరెను పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి జింబాబ్వే 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ఒక ఎండ్ నుంచి బిష్ణోయ్.. మరో ఎండ్ నుంచి సుందర్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు పరుగులు రావడం గగనమైపోయింది. చివర్లో క్లువ్ మదాండే, డియోన్ మైర్స్‌లు రాణించడంతో జింబాబ్వే వంద పరుగుల మార్క్‌ను అధిగమించింది.
బ్యాటింగ్ డమాల్
స్వల్ప లక్ష్యమే కదా నింపాదిగా ఆడితే విజయం మనదే అనుకున్న తరుణంలో తొలి ఓవర్‌లోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మను బెన్నెట్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్ బౌండరీతో ఖాతా తెరవడంతో ఇన్నింగ్స్ ఇక సాఫీగా సాగుతుందని అంతా భావించారు. కానీ ముజరబానీ అద్భుత బంతికి రుతురాజ్ (7) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పరాగ్ (2), రింకూ సింగ్ (0) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు.
దీంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఒక ఎండ్‌లో కెప్టెన్ గిల్ నిలబడడంతో జట్టు విజయంపై ధీమాగా ఉంది. గిల్ నిలబడినప్పటికి అతనికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. జురేల్, బిష్ణోయ్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. గిల్‌ను సికందర్ రజా బౌల్డ్ చేయడంతో భారత్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. ఈ దశలో సుందర్ కాస్త పోరాడడంతో భారత్‌కు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే టెయిలెండర్లు క్రీజులో ఎక్కువసేపు నిలబడకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.