calender_icon.png 30 September, 2024 | 11:57 AM

బతుకమ్మలా ఓనం పూల పండుగే

30-09-2024 02:04:42 AM

కేరళ, తెలంగాణ నడుమ ఎన్నో సారుప్యతలు

మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): బతుకమ్మ తరహాలోనే పూలను పూజించే గొప్ప ప్రత్యేకత గల పండుగ ఓనం అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బతుకమ్మ, ఓనం పండుగలు ప్రకృతిని ఆరాధిస్తూ సామూహికంగా నిర్వహించుకునే పండుగలని స్పష్టం చేశారు.

ఐక్యతకు, త్యాగానికి నిదర్శనంగా ఓనం పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. భౌగోళికంగా తెలంగాణ, కేరళ వేరైనప్పటికీ, సం స్కృతి పరంగా, ఆచార వ్యవహారాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సారుప్యతలున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని నలగండ్లలో మలయాళీలు ఆదివారం నిర్వహించిన ఓనం ఉత్సవానికి మంత్రి సీతక్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న కేరళ ప్రజలను ఉద్దేశించి సీతక్క మాట్లాడారు. జనం కోసం జీవించిన బలి చక్రవర్తి పునరాగమనానికి గుర్తుగా ఓనంను జరుపుకుంటారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేయాలన్న సందేశం ఓనం పండుగలో కనిపిస్తుందని చెప్పారు. ఓనం స్ఫూర్తితో ఇతరుల కోసం జీవించడం అలవర్చుకోవాలని సూచించారు. అవసరం ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి అండ గా నిలవాలని కోరారు.