calender_icon.png 3 October, 2024 | 9:01 PM

తెలంగాణ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

03-10-2024 06:50:18 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ సందీప్ కుమార్ సుల్తానియా (ఐఏఎస్)ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి   కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించినారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి కి మూలం బతుకమ్మ పండుగ ఒకటి అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ బతుకు నిస్తుందని  బలంగా నమ్ముతారన్నారు. తెలంగాణ ప్రాంతంలో  గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు బొడ్డెమ్మ పండగను పెళ్లి కానీ ఆడపిల్లలు 9 రోజులు ఆడతారని మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిదవ రోజు సుద్ధుల బతుకమ్మతో ముగుస్తుందన్నారు.

ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలను  ఒకచోట  చేర్చి బతుకమ్మను తయారు చేస్తారన్నారు. ఈ బతుకమ్మను ఎంతో నిష్టతో తయారు చేసి సాయంత్రం స్త్రీలందరు ఒకచోట చేరి  పూజించి చివరగా చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. దీనివల్ల  శాస్త్రీయంగా చెరువులో ఉన్న నీరు స్వచ్ఛంగా  తయారై పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో  ఈ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వర్సిటీ ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్  సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ అరతి,కంట్రోలర్ ఆచార్య అరుణ,  ఆచార్య లావణ్య ,  విజయలక్ష్మి, డాక్టర్ నీలిమ  మరియు ఇతర అధ్యాపకురాళ్లు, సిబ్బంది,విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ  గొప్పతనాన్ని ఆటపాట ద్వారా  తెలియజేశారు.