ప్రస్తుతానికి నగదు బహుమతి ఇద్దామా!
పండుగ 15 రోజుల్లో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు
నగదు పంపిణీకి దాదాపు రూ. 350 కోట్లు అవసరం
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కొలిచే పండుగ. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోనే మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తూ వచ్చింది.
అయితే బతుకమ్మ చీరల పంపిణీ పథకంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి బ్రేక్ వేసింది. ఈ బతుకమ్మ చీరలకోసం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు నాణ్యతలేని చీరలపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు వాటిని రోడ్డుపైనే దహనం చేసిన ఘటనలూ ఉన్నాయి. దీంతో ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగకు ఈసారి చీరల పంపిణీపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.
ఉగాదికే చీరల పంపిణీ
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని కొన సాగించకపోయినా తెలంగాణ ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మాత్రం కొనసాగిస్తామని ఇటీవల జరిగిన జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు ప్రతి ఏడాది రెండు కాటన్ చీరల చొప్పున అందిస్తామని, గతంలో పంపిణీ చేసిన వాటి కంటే మరింత నాణ్యమైనవి ఇస్తామని స్పష్టం చేశారు. అయితే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికిప్పుడు చీరలు తయారుచేయడం సాధ్యంకాదని నేతన్నలు చెబుతున్నారు.
మరి బతుకమ్మ పండుగకు కాకపోతే ఎప్పు డు ఇస్తారనే సందేహం మహిళల్లో ఉత్పన్నమవుతుంది. నేతన్నలకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే చీరల తయారీకి 6 నెలలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చీరలు మార్చి నాటికి ప్రభుత్వానికి అందుతాయి. మార్చి 30న ఉగాది పండుగ ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వం మహిళలకు ఉగాది పండుగకు చీరలు అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నగదు పంపిణీకి 350 కోట్లకు పైనే..
గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను 87 లక్షల రేషన్‌కార్డు దారులకు పంపిణీ చేశారు. దీని కోసం ప్రతి సంవత్సరం రూ. 370 కోట్ల ను కేటాయించింది. అయితే ఈ సారి బతుకమ్మ చీరలకు బదులు మహిళలకు అందిం చే నగదు కూడా రేషన్ కార్డుల ద్వారానే అం దించడంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.
అయితే పండుగ సందర్భంగా మహిళలు చీర కొనుక్కునే స్థాయిలో నగదు ఉండేలా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో మహిళకు కనీసం రూ. 500 అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డుదారులకు నగదు పంపిణీ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 87 లక్షల రేషన్‌కార్డు దారులందరికీ దాదాపు రూ.435 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే రేషన్ డీలర్ల ద్వారా ఈ నగదు పంపిణీ ప్రక్రియను చేపట్టినా అవినీతి ఆస్కారం ఉండే అవకాశం లేక పోలేదు. ఇదిలాఉండగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వారికే నగదు పంపిణీ చేసినా..
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారు. వీరందరికీ నగదు పంపిణీ చేసేందుకు సుమారు 350 కోట్ల వరకు అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా అయితే స్వయం సహాయక గ్రూపు బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకే నగదు బహుమతి అందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
15 రోజులే.. ఇంకా సందిగ్ధమే
వచ్చే నెలలో బతుకమ్మ పండుగ ఉండటంతో ఇంత తక్కువ సమయంలో ఇన్ని చీరలు తయారు చేయడం సాధ్యంకాకపోవడంతో ఈ సారి బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వరని సమాచారం. మరో 15 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తుండటంతో మహిళలకు పంపిణీ చేసే చీరలకు బదులుగా ప్రత్యామ్నా యం వైపు ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
చీరల పంపిణీకి బదులు ఏదైనా బహుమతి ఇచ్చే అంశం పై కసరత్తు చేస్తుంది. ఒకవేళ బహుమతి ఇస్తే ఏ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగదు రూపంలో ఇవ్వా లా.. లేక వస్తు రూపంలో ఇవ్వాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచ న చేస్తోంది.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు చీరలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే బహుమతిని ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని మహిళలకు ఇవ్వాలా.. లేక రేషన్ కార్డుదారులకు ఇవ్వాలా అం శంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుం ది. అందుకు ఎలాంటి అర్హతలు ఉండాలన్న విషయంపైనా దృష్టి సారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నగదు పంపిణీ కార్యక్రమంపై కూడా సందిగ్ధమే నెలకొంది.
సరుకులిస్తే ఎలా ఉంటుంది
ఈ చీరలు ఇవ్వడం కంటే అందుకు ఖర్చు చేసిన నగదు చేతికి ఇస్తే పండుగ ఖర్చులకు ఆసరాగా ఉంటాయన్న వాద న కూడా ప్రజల్లో నుంచి వస్తుంది. మరోవైపు కొన్ని పండుగలకు ఇచ్చినట్టుగా ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగకు ఉచితంగా చక్కెర, నూనె, బెల్లం, నెయ్యి, శనిగలు, కందిపప్పు పంపిణీ చేశారు.
ఏపీలోలాగే ఇక్కడ కూడా పండుగకు అవస రమయ్యే వస్తువులను అందిస్తే ఎలా ఉంటుందన్న యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు ఇలాంటి కార్యక్రమాల్లో అవినీతి కూడా జరిగే అవకాశం ఉండటంతో నేరుగా ప్రజల అకౌంట్లలో నే పండుగ కానుకగా ఎంతో కొంత మొ త్తం జమ చేస్తే సరిపోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ విషయంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ప్రభుత్వం ఏ ప్రక్రియను ఎంచుకున్నా.. 15 రో జుల్లో దానిని పూర్తి చేయగలమా అని ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.