- హైడ్రా కమిషనర్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు
- నా స్థలంలోకి ప్రవేశించిన వారిపై అంబర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశా
- బీఆర్‌ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట స్థలం పక్కా ప్రైవేట్ ల్యాండ్ అని, ప్రస్తుతం ఆ ల్యాండ్ తన పేరుతో ఉందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల సుధాకర్‌రెడ్డి తెలిపారు.
తనకు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో కుంటను క్లీన్ చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బతుకమ్మకుంటలో హైడ్రా అధికారులు జేసీబీలతో క్లీన్ చేయడాన్ని తప్పు పడుతూ సుధాకర్‌రెడ్డి బుధవారం సాయం త్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ కుంట అసలు వాటర్ బాడీ కాదనీ, ఇది పక్కా వేకెట్ ల్యాండ్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ఒక వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు హైడ్రాను తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శించారు. ఈ స్థలాన్ని సయ్యద్ అజం అనే వ్యక్తినుంచి కొనుగోలు చేసినట్టు తెలిపారు. బతుకమ్మకుంట గురించి తన వద్ద ఆధారాలన్నింటినీ హైడ్రా కమిషనర్‌కు ఆగస్టులోనే అందజేశానన్నారు.
ఈ ల్యాండ్‌పై మరొక వ్యక్తికి తనకు కోర్టులో వివాదం నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజకీయ నాయకుడి లా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తానన్నారు.