calender_icon.png 5 October, 2024 | 4:48 PM

పూలనే పూజించి దేవతలా.. గొప్ప పండుగ బతుకమ్మ

05-10-2024 01:41:51 PM

మహిళలతో ఆటపాటలు కోలాట నృత్యాలు చేసిన

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ 

జగిత్యాల (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శనివారం జగిత్యాల కలెక్టరేట్ సముదాయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు వారి శాఖల ద్వారా బతుకమ్మను తీరోక్క పూలతో తయారు చేసి మధ్యలో పెట్టి కోలాటాలు, ఉయ్యాల పాటలు డీజే పాటల నడుమ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ ఆయన సతీమణితో కలిసి ఉద్యోగులతో బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... మన పండగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అన్నారు. తొమ్మిది రోజులు ఆడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అన్నారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ జరుపుతారని, దేశంలో పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలోనే ఉందని, బతుకమ్మ పండుగను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించారని అన్నారు. ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ జిల్లా శాఖ అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.