calender_icon.png 22 October, 2024 | 1:57 PM

బతుకమ్మ పరిశోధకురాలిగా!

05-10-2024 12:00:00 AM

‘బతుకమ్మ బతుకమ్మా ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి పాటలు ఆమెపై బలమైన ముద్ర వేశాయి. పాటలోని మహాత్యం, గమ్మత్తు బతుకమ్మతో ప్రయాణించేలా చేశాయి. కన్నతల్లి లాంటి బతుకమ్మ పాటలు కనుమరగవుతున్న క్రమంలో కాళ్లకు బలపాలు కట్టుకొని ఊరూరా తిరిగి అధ్యయనం చేసింది. ‘చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ’ లాంటి ఎన్నో అందమైన పాటలను వెలుగులోకి తెచ్చింది. బతుకమ్మ తొలి పరిశోధకురాలిగా రికార్డుకెక్కిన డాక్టర్ బండారు సుజాత శేఖర్ పరిచయం ఈవారం విజయలో.. 

అది 1988..

నల్లగొండ జిల్లా.. దేవరకొండ

భారీ వరదలు ఆ ఊరిని ముంచెత్తాయి.

వరదల ధాటికి ఆర్టీసీ బస్సు వాగులో 

కొట్టుకుపోయింది. 

అబ్బాస్ అనే యువకుడు ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడి చనిపోయాడు. 

ఆ వాస్తవ ఘటనపై.. ‘అయ్యాయ్యో ఉయ్యాలో.. ఉప్పాగు వచ్చెన్నమ్మా ఉయ్యోలా.. పొంగెనమ్మో ఉయ్యాలో... నల్లగొండనమ్మా ఉయ్యాలో’ అని పాడి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

1956 సెప్టెంబర్ 2

మహబూబ్‌నగర్ జడ్చర్ల 

భారీ వరదలకు రైల్వే వంతెన తెగి 

దాదాపు 112 మంది చనిపోయారు. 

అది చరిత్రలో మరిచిపోలేని ఘటన.. ఆ ఘటనను భవిష్యత్ తరాలకు గుర్తుచేసేలా ‘విధిచేత రాతలు ఉయ్యాలో.. మార్చతరమా తల్లిఉయ్యాలో.. విధిని ఎదురించిగా ఉయ్యాలో.. ఎవరితరం కాదు ఉయ్యాలో’ అంటూ.. ఆనాటి ఘటనపై తన రచనతో ఎంతోమందిని కదిలించింది సుజాత శేఖర్. 

భూకంపాలు.. ప్రకృతి వైపరీత్యాలు.. ఆడపిల్లల హత్యలు.. తెలంగాణ ఉద్యమం.. ఇలా సందర్భం ఏదైనాసరే అందుకు సంబంధించిన ఘటనలపై బతుకమ్మ పాటలు రాసి పాడటం సుజాత శేఖర్ ప్రత్యేకత. బతుకమ్మలోని సత్యాన్ని, తత్వాన్ని పదిమందికి తెలియజేస్తూ ఎన్నో పాటలను రాశారామె. టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లో బతుకమ్మ పాటలపై పీహెచ్‌డీ చేసి పూల పండుగను విశ్వవ్యాప్తం చేశారు. అంతేకాదు.. సమకాలీన అంశాలపై 11 పుస్తకాలను ప్రచురించి విశిష్ట మహిళగా గుర్తింపు పొందారు. 

తల్లి ప్రేరణతో.. 

బండారు సుజాత శేఖర్‌ది నల్లగొండ జిల్లా దేవరకొండ. దేవరకొండ ఖివరకొండ, ఆ పరిసర ప్రాం తాలు ఆమెను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆమెకు తెలియకుండానే ప్రకృతి పండుగ బతుకమ్మకు దగ్గరైంది. దీనికితోడు ఇంట్లోవాళ్లు పండుగలు, పర్వదినాలు ఘనంగా జరిపేవారు. ముఖ్యంగా బతుకమ్మ పండగ వచ్చిందంటే వారం రోజుల నుంచే సందడి మొదలయ్యేది.

‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ లాంటి పాటలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ పాటలోని అర్థం, పరమార్థం తల్లి అనసూయమ్మను అడిగి తెలుసుకునేది. అలా చినవయస్సులోనే పాటలు పాడటం.. ఆడటంతో బతుకమ్మ ఆమె జీవితంలో భాగమైంది. కోటి మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె జానపద పుస్తకాలు చదివి బతుకమ్మను పూర్తిగా అర్థం చేసుకున్నారు.

తొలి మహిళ 

ఉపాధ్యాయురాలిగా కెరీర్‌గా కొనసాగించినా.. సుజాత శేఖర్ ఏనాడు బతుకమ్మను విడిచిపెట్టలేదు. ఆమె పెరుగుతున్నకొద్దీ బతుకమ్మపై ఇష్టం పెంచుకోసాగింది. ఈ క్రమంలో ఇష్టమైన సబ్జెక్టు బతుకమ్మపై డాక్టరేట్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ సమయంలో బతుకమ్మపై పీహెచ్‌డీయా? అంటూ ఎంతోమంది విమర్శించినా వెనకడుగు వేయలేదు.

“తెలంగాణ బతుకమ్మ పాటలు పౌరాణిక, చారిత్రక, సాంఘికపరమైనవి. బతుకమ్మ పాట జనంలో పుట్టింది. అందుకే డాక్టరేట్ చేశా. ఈరోజుల్లో పీహెచ్‌డీ అంటే ఓ టైంపాస్ వ్యవహరంగా ఉంది. కానీ అప్పట్లో అంటే 1989లో అంత అషామాషీ కాదు.  టెక్నాలజీ లేదు. మొబైళ్లు ఫోన్లు కూడా లేవు. ఏ పుస్తకంలో ఏ పాట దొరుకుతుందో? అని ఆశగా ఎన్నో ఊళ్లు తిరిగా.

రెండు బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకొని తెలంగాణవ్యాప్తంగా వందలాది పాటలను సేకరించా.. అలా నాలుగేళ్లపాటు బతుకమ్మ పుట్టపురోత్తలరాలపై సమగ్ర అధ్యయనం చేసి పరిశోధన గ్రంథం సమర్పించా. అమ్మపాట.. నాన్న ఆశయం.. భర్త తోడు ఈమూడు అంశాలే నాచేత బతుకమ్మపై డాక్టరేట్ చేసేలా చేశాయి” అని తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు సుజాత శేఖర్.

జానపదంపై పట్టు

బతుకమ్మ పండుగకు పుట్టిల్లు తెలంగాణ. అందుకే లోతైన పరిశోధనలు జరగాలని అంటారు సుజాత శేఖర్. “ ప్రస్తుతం మౌఖిక సాహిత్యమైన బతుకమ్మ పాటలు పాడుకున్న మొదటి తరం నేడు లేదు. ఈతరంవారైనా వాటిని సేకరించి పదిల పరచాల్సిన బాధ్యత ఉంది.

ఆదిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇదే విషయాన్ని నేను ఎన్నోసార్లు నొక్కి చెప్పా. స్వరాష్ట్రంలోనైనా బతుకుమ్మ పాటలను రెండోతరం వారినుంచి ఒడిసి పట్టుకోకపోతే. భావితరాలకు అన్యాయం చేసినట్టే అవుతుంది” అని అంటారామె.

పాఠ్యాంశంగా బతుకమ్మ

బతుకమ్మపై డాక్టరేట్ చేసే క్రమంలో ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు కూడా. ఉపాధ్యాయురాలిగా నూతన విద్యా విధానంలో తొలితరం పాఠ్య పుస్తక రచయిత్రిగా సృజనతోకూడిన బోధన అందించారు. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా ‘ఉయ్యాలండి ఉయ్యాల ... ఊహల పల్లకి ఉయ్యాల’ అనే పాట రచించి టీచర్‌గా తనదైన ముద్రవేశారు.

అప్పట్లో ఆ పాట మూడో తరగతి పాఠ్యాంశంగా చేరింది. అలాగే సామాజిక కార్యకర్తగా మహిళల, చిన్నారుల సమస్యల పట్ల స్పందించి పాటలు రాశారు. బాల కార్మికుల విమోచనకు కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం తన కలాన్ని, గళాన్ని కడిలించారు కూడా. “చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించారు.

నల్లగొండ మణిపూసగా పేరొందిన సుజాత శేఖర్ నేషనల్ ఇంటర్నేషనల్ సేమినార్స్‌లో పాల్గొని బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు. ఇప్పటికీ ఆమె పాటలు సినిమాల్లో, యూట్యూబ్ లో వినొచ్చు. “భారత మహిళా శిరోమణి, కవిరత్న, మహిళ టాప్ టెన్ విశిష్ట మహిళ, ఉత్తమ ఉపాధ్యాయుని, అంతర్జాతీయ మహిళ విశిష్ట పురస్కారం, 50 ఇన్ స్పురై ఉమెన్‌”.. ఇలా ఎన్నో అవార్డులు పొందారు. 

నిజమైన బతుకమ్మ దూరం

పూలనే దైవంగా కొలిచే సంప్రదాయం మనది. బతుకమ్మ అంటే పండుగ మాత్రమే కాదు. ఓ కళానైపుణ్యం కూడా. బతుకమ్మ కోసం తీరొక్క పూలు సేకరించడం, రంగులు అద్దడం, ఓ క్రమపద్ధతిలో పేర్చడం లాంటివి కళతో కూడుకున్నవి. మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి ఆడటం, దూకడంతో శారీరకంగా శ్రమ అందేది.

కానీ ఈరోజుల్లో బతుకమ్మ అంటే ఫ్యాషన్‌గా మారింది. ఐదుగురు మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి, డీజే పాటలు పెట్టుకొని ఆడుతున్నారు. డీజేల హోరులో బతుకమ్మ పాటలు పదిమందికి వినిపిస్తున్నా.. నిజమైన బతుకమ్మ దూరమవుతుంది. ఆరోజుల్లో బతుకమ్మ ఆడేది చుట్టూ వందమంది చేరి కోరస్ పాడేవాళ్లు. కాబట్టి నిజమైన బతుకమ్మను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- బాలు జాజాల