calender_icon.png 27 October, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేసిక్ డీమ్యాట్ అకౌంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

29-06-2024 12:53:06 AM

న్యూఢిల్లీ, జూన్ 28: చిన్న ఇన్వెస్టర్లకు డీమ్యాట్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ) పరిమితిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పెంచింది. ఇప్పటివరకూ రూ. 2 లక్షల వరకూ ఉన్న పరిమితిని రూ. 10 లక్షలవరకూ పెంచుతున్నట్టు శుక్రవారం సెబీ తెలిపింది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేదిశగా జారీచేసిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని సెబీ విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ బీఎస్‌డీఏను 2012లో తొలిసారిగా ప్రవేశపెట్టారు.

డీమ్యాట్ ఖాతా నిర్వహణ కోసం డిపాజిటరీలు వసూలు చేసే వార్షిక చార్జీలు, సెక్యూరిటీలు విక్రయించినపుడు వసూలు చేసే చర్జీలు బీఎస్‌డీఏకు తక్కువగా ఉంటాయి. బీఎస్‌డీఏగా అర్హత పొందేందుకు ఒక ఇన్వెస్టరు ఒకే డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. ఇప్పటివరకూ అందులో రూ.2 లక్షల విలువైన రుణపత్రాల్ని (బాండ్లు), రూ.2లక్షల విలువైన రుణత్రాలుకానివాటిని (షేర్లు తదితరాలు) అట్టిపెట్టుకునేందుకు అనుమతి ఉంది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకనుంచి రూ.10 లక్షల విలువకు మించకుండా డెట్, నాన్‌ఘ సెక్యూరిటీలను అట్టిపెట్టుకునే ఖాతాను బీడీఎస్‌ఏగా పరిగణిస్తారు.

రూ. 4 లక్షల పోర్ట్‌ఫోలియో వరకూ ఎటువంటి వార్షిక డీమ్యాట్ నిర్వహణ చార్జీలు ఉండవు. రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల ఖాతాలకు రూ.100 చార్జీ ఉంటుంది. అయితే పోర్ట్‌ఫోలియో విలువ రూ.10 లక్షలు మించితే బీడీఎస్‌ఏ ఆటోమాటిక్‌గా రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాగా మార్చివేస్తారు. అందుకు నిర్దేశించిన చార్జీలనే వసూలు చేస్తారు. అర్హులైన ఖాతాదారులకు బీఎస్‌డీఏ ఖాతానే తెరవాలని, వారు కోరుకుంటే రెగ్యుటర్ డీమ్యాట్ ఖాతాను తెరవచ్చని డిపాజిటరీ పార్టిసిపెంట్లను (డీపీలు) సెబీ ఆదేశించింది. డీపీలు ప్రస్తుత డీమ్యాట్ ఖాతాలను సమీక్షించి, అర్హమైన డీమ్యాట్ ఖాతాల్ని రెండు నెలల్లోపు బీఎస్‌డీఏగా మార్చాలని అదేశించింది. ప్రతీ బిల్లింగ్ సైకిల్‌లోనూ ఈ సమీక్షను కొనసాగించాలన్నది.