27-02-2025 01:14:43 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యండి. జహంగీర్ డిమాండ్
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 26 ( విజయ క్రాంతి ): బస్వాపురం రిజర్వాయర్ కు తక్షణం 300 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, ముంపునకు గురైన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహరం చెల్లించాలని, ప్రాజెక్టు నుండి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేయడానికి 6 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి, వడపర్తి పరిధిలోని వాగు చెరువును, చౌకులతండా దగ్గర నిర్మాణం అవుతున్న కాలువను రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, త్రాగు నీటికి ఉపయోగపడే బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంకు 300 కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేస్తే నిర్వాసితులుకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించడానికి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రి , నీటిపారుదల శాఖమంత్రి బాధ్యత తీసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి విడుదల చేయాలని సూచించారు. అత్యంత కీలకమైన వడపర్తి కత్వను నింపితే భువనగిరి, బీబీనగర్ చెరువులు నిండుతాయని వాటి ఆధారంగా పదుల సంఖ్యల గ్రామాలలోని చెరువులు దింపవచ్చు తద్వారా వందలాది ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలియజేశారు.
ఇప్పటికే ప్రభుత్వం చౌకులతండ నుండి వడపర్తి కత్వ వరకు కాల్వ తీయడానికి ప్రతిపాదన ఉన్నదని ఈ కాల్వ నిర్మాణానికి కేవలం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తి కావడానికి అవకాశం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వము నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో ప్రాజెక్టు పూర్తి కోసం, కాలువల నిర్మాణం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, శాఖ కార్యదర్శి పాండాల ఆంజనేయులు, నాయకులు తెల్జూరి మాణిక్యం, రైతులు ఎర్ర మహేష్ , మేడబోయిన బాలయ్య, ముత్తయ్య, పెద్దగోల్ల సుదర్శన్, బాలయ్య, జిన్నా రామచంద్రం, శ్రీను పాల్గొన్నారు.