calender_icon.png 20 October, 2024 | 3:06 AM

బాసరకు పాలకవర్గం కరువు

20-10-2024 12:18:57 AM

  1. పదేళ్లలో రెండేళ్లు మాత్రమే.. 
  2. సరస్వతీ ఆలయంపై దృష్టి పెట్టని సర్కార్
  3. అస్తవ్యస్తంగా ఆలయ నిర్వహణ

నిర్మల్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దక్షణ భారత దేశంలోనే ఉన్న ఏకైక సరస్వతి దేవాలయం బాసరపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పాలకవర్గం ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.

తెలంగాణా వచ్చి పదేళ్లు అవుతున్నా కేవలం రెండేళ్లు మాత్రమే బాసర ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రభుత్వాలపై భక్తులు మండిపడుతున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరిగి, ఆదాయ వనరులు పెరుగుతున్నా ఆలయ నిర్వహణ మాత్రం అగమ్య గోచరంగా ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

రెండేళ్లు మాత్రమే కొనసాగిన కమిటీ.. 

ప్రత్యేక తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 మాత్రమే పాలకవర్గాన్ని ప్రకటించింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొత్త పాలకవర్గాన్ని ఖారారు చేశా రు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సంప్రాదాయ పరంగా పాలకవర్గాన్ని గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవి.

చైర్మన్‌గా బాసరకు చెందిన శరత్‌పాఠక్ కుటుంబ సభ్యులకు వంశ పారపర్యంగా చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీ. మరో 13 మందిని పాలకవర్గ సభ్యులుగా ప్రభుత్వాలు నామినెట్ పద్ధతిలో నియమించేవి.

ప్రత్యేక తెలంగాణ అనంతరం 2017 లో కొత్త పాలకవర్గం నియమించగా 2018 అక్టోబర్‌లో పదవీకాలం ముగి సింది. తర్వాత కొత్త పాలకవర్గం కోసం మం త్రి ఇంద్రకరన్‌రెడ్డితో పాటు అప్పటి ముధో ల్ ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్‌ను సంప్రదించారు. కొన్ని కారణా ల వల్ల కొత్త పాలకవర్గం ఖరారు కాలేదు. 

ఆలయంలో సిబ్బంది కొరత

బాసర సరస్వతి ఆలయ  కొత్త పాలకవర్గం ఖరారు చేయక పోవడంతో ఇన్‌చార్జి ఆలయ పర్యవేక్షణ అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో ఆలయ నిర్వహణ కుంటిపడిందని భక్తులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగి ఆదాయం వస్తున్నా రెగ్యులర్ అధికారులను నియమించక పోవడంతో ఖాళీల కొరత వేధిస్తున్నది.

దీంతో వచ్చిన నిధులకు ప్రణా ళికలు లేకపోవడంతో సదుపాయాలు, పరిపాలన వ్యవహారాలు భక్తులకు ఇబ్బందులను గురి చేస్తున్నాయి. ప్రస్తుతం బాసర అమ్మవారి ఆలయానికి రెగ్యులర్ ఈవో లేక నిజామాబాదు అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు ఇన్‌చార్జుగా వ్యవ హరిస్తున్నారు. పూజరులు, ఇతర సిబ్బంది కొరత వేధిస్తున్నది.

తాత్కాలిక ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారు. తాత్కాలిక ఉద్యో గులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే బాస రలో లడ్డు, పులిహోరాలో అక్రమాలు జరగడంతోపాటు సిబ్బంది చేతివాటం ప్రదర్శిం చడంతో కొందరిని తొలగించారు.

2018 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదనే విమర్శ లొస్తున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఎలా ఉపయోగించాలో తెలియక ఇటీవలే వచ్చిన రూ.43 లక్షలు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. దీంతో భక్తులు మండి పడుతున్నారు. 

జాప్యంపై విమర్శలు

బాసర సరస్వతి ఆలయ పాలకవర్గం ఖరారుపై ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్‌గా శరత్ పాఠక్ కుటుంబ సభ్యులకు ఆవకాశం కల్పిస్తే, మిగిలిన 13 మంది సభ్యుల్లో ఒకరు బాసర ఆలయ ప్రధాన పూజారి ఉంటారు.

నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గంలోని 9 మంది సభ్యులతో పాటు స్థానిక ఎమ్యెల్యే, ఆలయ ఈవో తదితరులు పాలకవర్గంలో సభ్యులుగా ఉంటారు. పాలకవర్గంలో సభ్యులను కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పద్ధతిలో నియమించనుండటంతో సీనియర్ నాయకులు, పారీ ్టకోసం విధేయతతో పనిచేసి భక్తి భావం ఉన్నవారికి చోటు దక్కే అవకాశం ఉంది.

నిర్మల్, భైంసా పట్టణాలకు చెందిన వారిని ఎంపిక చేస్తే దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి సర్కార్ నామినేటెడ్ పదవుల నియామక పక్రియ ప్రారంభించిన నేపథ్యంలో బాసర పాలకవర్గంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. 

నిరాశ చెందుతున్న ఆశావహులు

బాసర పాలకవర్గం ఏర్పాటులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో ఆశవహులు నిరాశకు గురవుతున్నారు. నిర్మల్, ముధోల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులతోనే నెట్టుకువస్తున్నది. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ముధోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇన్‌చార్జులుగా కొనసాగుతున్నారు.

ఎన్నికల తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నామినేటేడ్ పదవుల్లో తమ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం లభించేలా పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు.

ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క వద్ద లాబీయింగ్ చేయడంతో పార్టీలో విభేదాలు రాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అవకాశం కల్పించేలా అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. అదే విధంగా పాతతరం, కొత్తతరం నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది.

దీపావళిలోపు బాసర ఆలయ నూతన పాలకవర్గం ఖారారు చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సీనియర్ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి అలోల్ల, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డితోపాటు కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఖరారు చేయనున్నట్టు తెలిసింది. 

నామినేటెడ్ పదవులపై ఆశలు

2023లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్‌లో మాత్రమే విజ యం సాధించగా ముధోల్, నిర్మల్‌లో ఆ పార్టీ ఓడిపోయింది. అయి నప్పటికీ రాష్ట్రంలో అధికార పగ్గాలు కాంగ్రెస్ చేతిలోనే ఉండటంతో నామినేటెడ్ పదవులపై నిర్మల్ జిల్లా కు చెందిన పలువురు నేతలు ఆశలు పెంచుకున్నారు.

బాసర కొత్త పాలకవర్గంలో చోటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇన్‌చార్జి మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావుపటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితర నేతలు నామినేటెడ్ పదవుల్లో తమ మద్దతుదారులకు అవకాశం కల్పించేలా పావులు కదుపుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.