రంజీ ట్రోఫీ
వడోదర: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబైకి షాక్ తగిలింది. బరోడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 84 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఎలైట్ గ్రూప్ భాగంగా బరోడాతో మ్యాచ్‌లో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.
టాపార్డర్ వైఫల్యం చెందగా.. మిడిలార్డర్‌లో సిద్దేశ్ లాడ్ (59), శ్రేయస్ అయ్యర్ (30) పర్వాలేదనిపించడంతో ముంబై కనీసం 150 పరుగు ల మార్క్‌ను దాటగలిగింది. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 6 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మహేశ్ పితియా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.
మిగిలిన మ్యాచ్‌ల్లో తమిళనాడు ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. ఇక చంఢీఘర్ జట్టుపై రైల్వేస్, పంజాబ్‌పై కేరళ జట్టు, బిహార్‌పై హర్యానా, హైదరాబాద్‌పై గుజరాత్, మేఘాలయాపై సర్వీసెస్, ఉత్తరాఖండ్‌పై హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రపై విదర్భ జట్టు విజయాలు సాధించాయి. రెండో రౌండ్ మ్యాచ్‌లు అక్టోబర్ 18 నుంచి జరగనున్నాయి.