calender_icon.png 13 December, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో బరోడా

12-12-2024 12:28:18 AM

  • క్వార్టర్స్‌లో బెంగాల్‌పై విజయం n రాణించిన హార్దిక్ పాండ్యా
  • నాకౌట్‌కు ముంబై, మధ్యప్రదేశ్, ఢిల్లీ n సయ్యద్ ముస్తాక్ టోర్నీ

బెంగళూరు: దేశవాలీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బరోడా జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగాల్‌తో జరిగిన క్వార్టర్స్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (40) టాప్ స్కోరర్ కాగా.. అభిమన్యు సింగ్ (37), శివాలిక్ శర్మ (24) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రామాణిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 18 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ అహ్మద్ (55) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారు రాణించడంలో విఫలమయ్యారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి ఆకట్టుకోగా.. లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ కూడా చెరో 3 వికెట్లు తీసి బెంగాల్ పతనాన్ని శాసించారు. శుక్రవారం జరగనున్న తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై, రెండో సెమీస్‌లో మధ్య ప్రదేశ్‌తో ఢిల్లీ ఆడనుంది.

దంచికొట్టిన రహానే..

మరో క్వార్టర్స్‌లో విదర్భపై విజయాన్ని అందుకున్న ముంబై సెమీస్‌లో అడుగుపెట్టింది. ఓపెనర్లు అజింక్యా రహానే, పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అథర్వ టైడే (66) అర్థసెంచరీతో రాణించగా.. మిడిలార్డర్‌లో వాంఖడే (51), శుభమ్ దూబే (43) రాణించడంతో విదర్భ మంచి స్కోరు సాధించింది.

అయితే ఛేదనలో ఆరంభం నుంచే రహానే (45 బంతుల్లో 84), పృథ్వీ షా (26 బంతుల్లో 49) దూకుడుగా ఆడడంతో ముంబై పని సులువుగా మారింది. ఈ ఇద్దరు ఔటైనప్పటికీ ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్), సుయాన్ష్ షెడ్గే (36 నాటౌట్) ముంబైని విజయతీరాలకు చేర్చారు. 

వెంకీ ఆల్‌రౌండ్ ప్రదర్శన..

సౌరాష్ట్రతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చిరాగ్ జని (80 నాటౌట్) రాణించాడు. వెంకీ, ఆవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఆ తర్వాత 19.2 ఓవర్లలో మధ్యప్రదేశ్  టార్గెట్‌ను అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్స్‌లో ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఉత్తర్ ప్రదేశ్‌పై విజయాన్ని నమోదు  చేసుకుంది.