calender_icon.png 4 March, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్లీ భలే రుచి

02-03-2025 12:00:00 AM

బార్లీ గింజల్లో అనేక పోషకాలుంటాయి. అందుకే చాలామంది హెల్దీ డ్రింక్స్‌గా వాడుతుంటారు. అయితే ఎండాకాలంలో శరీరం చల్లబడాలంటే ఆరోగ్యకరమైన బర్లీ వంటకాలు తినాల్సిందే. బార్లీ గింజలతో కిచిడీ, జావ, ఖీర్, ఉప్మా లాంటివి చేసుకుని తింటే వేడి నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు. ఆ వంటకాలు ఏమిటో తెలుసుకుందామా.. 

బార్లీ ఖీర్

కావాల్సిన పదార్థాలు

బార్లీ గింజలు ఒక కప్పు, పాలు రెండు కప్పులు, సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కలు, బాదం పది (సన్నగా కట్ చేయాలి), జీడిపప్పు తగినంత, ఎండు ద్రాక్ష పది, యాలకులు నాలుగు, తేనె ఒక చెంచా

తయారీ విధానం

రాత్రంతా బార్లీ గింజలను నానబెట్టుకోవాలి. ఎప్పుడు ఖీర్ చేసుకోవాలన్నా అంతకంటే ముందు కనీసం ఏడు గంటల పాటు బార్లీ గింజలను నానబెట్టుకుని ఉంచుకోవాలి. పిండిలా అవుతుంటే బార్లీ నానినట్లు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో పాలు పోసి సిమ్‌లో వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత బార్లీని వేయాలి. మధ్యలో గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. పాలు చిక్కబడుతుంటాయి.

తరిగిన ఖర్జూరం ముక్కలను వేసి కలపాలి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేయాలి. ఆ తర్వాత యాలకులు వేసి కొద్ది సేపు ఉడికించాలి. బార్లీ బాగా ఉడికితే ఖీర్ అయినట్లే. చివరగా గిన్నెలో వేసుకుని అందులో బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుని తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది. 

బార్లీ కిచిడీ

కావాల్సిన పదార్థాలు

బార్లీ గింజలు ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి (సన్నగా తరగాలి), జిలకర ఒక చెంచా, పచ్చి మిరపకాయలు రెండు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి), క్యారెట్లు రెండు (మీడియంసైజ్ ఉండాలి. చిన్న ముక్కలుగా కట్ చేయాలి), తరిగిన బీన్స్ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వీట్ కార్న్ పావు కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి మూడు చెంచాలు, కరివేపాకు పది ఆకులు

తయారీ విధానం

బార్లీ గింజలను ముందురోజు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. నీటిని తీసేసి గింజలను గిన్నెలో ఉంచుకో వాలి. వంట చేసే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు మరో గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక జిలకర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, బీన్స్, స్వీట్‌కార్న్, క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత వేడినీళ్లు పోయాలి. అందులో ఉప్పు వేసి కాసేపు మూతపెట్టి మీడియం మంటపై ఉంచుకోవాలి. చివరగా కిచిడీని కొత్తమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.  

బార్లీ జావ

కావాల్సిన పదార్థాలు

జావ తయారీకి పావు కప్పు బార్లీ గింజలను తీసుకోవాలి. మజ్జిగ ఒక కప్పు, దానిమ్మ గింజలు గుప్పెడు, ఉప్పు తగినంత, నీళ్లు సరిపడా.

తయారీ విధానం

బార్లీ గింజలను కడిగి నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గింజలు త్వరగా ఉడుకుతాయి. అయితే కుక్కర్‌లో వేసి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తరువాత వడబోసి పటికబెల్లం, నిమ్మరసం కలిపి తాగవచ్చు. పలుచని మజ్జిగ కలిపి దానిమ్మ గింజలను వేసి కూడా తీసుకోవచ్చు. అయితే మజ్జిగకు బదులుగా పుచ్చకాయ రసం, పైనాపి ల్ రసం కలిపి తాగినా చాలా రుచిగా ఉంటుంది.

బార్లీ ఉప్మా

కావాల్సిన పదార్థాలు

తరిగిన క్యా రెట్, బీన్స్, బఠానీలు (సరిపడా), మినపప్పు ఒక చెంచా, ఆ వాలు ఒక చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ఒక చెంచా, నూనె, ఉప్పు తగినంత

తయారీ విధానం

కుక్కర్‌లో నెయ్యి, నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తర్వాత కూరగాయల ముక్కలు వేసి కలపండి. ఇప్పుడు బార్లీని వేసి అన్నీ కలిపి కొన్ని నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఒక కప్పు నీరు పోయండి. రుచికి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం మంటపై రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.