calender_icon.png 3 April, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐ చెంతకు బార్ అసోసియేషన్ డిమాండ్

27-03-2025 11:49:12 PM

యశ్వంత్ వర్మ బదిలీని నిలపాలంటున్న అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్..

ధర్నాలు చేస్తున్న న్యాయవాదులు..

సీజేఐ సంజీవ్ ఖన్నాకు తెలిసిన డిమాండ్..

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికాయనే విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం కొలీజియం వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘అలహాబాద్ హైకోర్టు చెత్త కుండీ అనుకుంటున్నారా’ అని కూడా బార్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. సంజయ్ వర్మకు అలహాబాద్ హైకోర్టుకు పంపొద్దని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ డిమాండ్ గురించి సీజేఐ సంజీవ్ ఖన్నాకు తెలిసినట్లు సమాచారం. 

సీజేఐ హామీ ఇచ్చారు..

‘జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేసే ఆంశంపై మా డిమాండ్‌ను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి మాకు హామీ ఇచ్చారు’ అని అలహాబాద్ బార్ అసోసియేషన్ చీఫ్ అనిల్ తివారీ పేర్కొన్నారు. జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు లభించడంతో సుప్రీం కొలీజియం ఈ బదిలీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ కూడా జస్టిస్ వర్మకు ఎటువంటి బాధ్యతలు అప్పగించడం లేదు. ఇప్పటికే ఈ ఘటన మీద విచారణ జరిపేందుకు చీఫ్ జస్టిస్ ముగ్గురితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆరోపణలపై వర్మ స్పందిస్తూ.. నా పరువుకు భంగం కలిగించేందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

త్వరలోనే బదిలీ.. 

జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని త్వరలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రభుత్వం సమీక్ష చేస్తోందని, అతి త్వరలోనే బదిలీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.