calender_icon.png 24 December, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఖార్సైన తెలంగాణవాది బాపూజీ

27-09-2024 12:00:00 AM

కామిడి సతీష్ రెడ్డి :

నేడు కొండాలక్ష్మణ్ జయంతి :

పోరాటం, సాహసం, ధైర్యం, పట్టుదల, త్యాగం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి, పాలనాదక్షత, ప్రజాహిత సేవ, విలక్షణమైన నాయకత్వ లక్షణాల సమ్మేళనమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర సమర స్ఫూర్తి గల ఆయన పెత్తందారీ దోపిడి సామాజిక వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. దోపిడీకి గురవుతున్న ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన  నాయకుడు. క్విట్ ఇండియా ఉద్యమానికి అనుగుణంగా హైదరాబాద్‌లో సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం కావాలని ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప ధైర్యశాలి. ఆ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నందుకుకు 13 సార్లు అరెస్ట్ వారెంట్లు నాటి ప్రభుత్వం జారీ చేసినా భయపడలేదు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న పూర్వ ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్) లోని వాంకిడి గ్రామంలో పద్మశాలి సామాజిక వర్గంలో జన్మించారు. మూడు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. రాజు రామఘర్‌లో బాల్యం గడిపిన ఆయన ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్‌లో సాగించారు. తన 20వ ఏట మిడిల్ స్కూల్ , 23 వ ఏట మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. 25వ ఏట హైదరాబాద్‌లో న్యాయవాద కోర్సు పాసైన అనంతరం 1945లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆయన జీవిత భాగస్వామి డాక్టర్ కొండా శకుంతలాదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.  కుమారుడు ఒకరు భారత వైమానిక దళంలో ఉంటూ దేశ సేవలో వీరమరణం పొందారు.

హైదరాబాద్‌లోని సచివాలయానికి సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుతం నెక్లెస్ రోడ్) భూమి కొని ‘జలదృశ్యం’  పేరుతో ఇల్లు నిర్మించుకొని నివసించే వారు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా, కోర్టుకు వెళ్లిన ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన అంత్యక్రియలు సైతం 2012సెప్టెంబర్ 21న జలదృశ్యంలోనే జరిగాయి. స్వాతంత్రోద్యమ కాలంలో 1941లో మహాత్మా గాంధీతో కలిసి ఆయన అడుగు జాడల్లో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అ

లాగే దేశానికి స్వాతంత్య్రం తరువాత హైదరాబాద్ సంస్థానం నిజాం ప్రభువు ఆధీనంలో ఉన్న క్రమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1947 -48 మధ్యకాలంలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబు విసిరిన నారాయణ రావు పవార్ బృందంలో లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు.1952-69 మధ్య కాలంలో జరిగిన నాన్ ముల్కీ ఆందోళనలో పాల్గొన్నారు.

రాజకీయ జీవితం

ఆనాడు ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీపై ప్రభుత్వం విధించిన నిర్బంధం  తొలగించిన తర్వాత 1945లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో  ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి  ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 1957లో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్‌డ్ కావడంతో  పద్మశాలి సామాజిక వర్గం అధికంగా ఉన్న నల్గొండ జిల్లాకు మారి 1957లో చిన్న కొండూరు, (ప్రస్తుతం భువనగిరి) నియోజకవర్గం నుండి గెలిచారు.

1957-60 మధ్యకాలంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత 1960-62 మధ్యకాలంలో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్, లఘు పరిశ్రమలు, చేనేత , టెక్స్‌టైల్ శాఖల మంత్రిగా,1967-69 కాలంలో కాసుబ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కార్మిక,సమాచార శాఖ మంత్రిగా అందరి మన్ననలు పొందిన ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్. 1962 లో మునుగోడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడినా 1967-72, 1972-78 వరకు రెండుసార్లు భువనగిరినుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంపిక సమస్య వచ్చినప్పుడు కూడా దామోదరం  సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించడంలో ఆయన పాత్ర కీలకం. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం అనేది దేశంలోనే చారిత్రక సంఘటనగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ,1969 మార్చి 27న మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.

ఉప ముఖ్యమంత్రి పదవి అవకాశాన్ని  కాదని తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప తెలంగాణ వాది. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో  తెలంగాణ సాధన సమితిలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ, తెలంగాణకు రాష్ట్ర హోదా కావాలని గట్టిగా పోరాడారు. పట్టు వదలకుండా నాలుగు దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధనకే నిత్యం శ్రమించిన వ్యక్తి బాపూజీ.

వెనుకబడినవర్గాల కోసం ఉద్యమం

హైదరాబాద్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకోసం బొజ్జం నరసింహులు సహకారంతో 1950లో సంఘం స్థాపించి బలహీన వర్గాల ఉద్యమానికి నాయకుడిగా గణనీయమైన కృషి చేశారు. వెనుకబడినవర్గాల స్థితిగతులను మెరుగు పరచేందుకు నియమించిన కాకా -కాలేల్కర్ కమిషన్ రాష్ట్ర పర్యటన సందర్భంలో ముఖ్య పాత్ర పోషించారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హక్కుల పరిరక్షణకు, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేశారు. అనంతరామన్ కమిషన్, మురళీధర్ కమిషన్‌లు బీసీలకోసం చేసిన సిఫార్సుల అమలుకు సర్దార్ గౌతు లచ్చన్నతోపాటు అనేకమందిని ఐక్యపరచి 1986 లో తిరుపతిలో బీసీల సభ ఏర్పాటు చేసి విజయవంతం చేయడం లో ఎన లేని కృషికి గుర్తుగా ఆ సభా వేదిక కొండా లక్ష్మణ్‌కు ‘ఆచార్య’ బిరుదును ప్రదానం చేసింది.

వృత్తిదారుల కోసం -సహకార ఉద్యమం

ఒకవైపు దేశ స్వాతంత్య్రానికి పోరాటం చేస్తూనే, మరోపక్క వృత్తిదారుల దయనీయ స్థితిగతులను మెరుగుపరచడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు సహకార ఉద్యమాన్ని చేపట్టి, గ్రామ, గ్రామాన సహకార సంఘాలను నెలకొల్పారు. అంతటితో తృప్తి చెందక, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసారు. గీత, మత్స్య, కుమ్మరి, వడ్రంగి, కంచరి, చర్మకారులు, మేదరి,ఉప్పర, ఇతర వృత్తుల వారికి సహకార సంఘాలను నెలకొల్పి వృత్తిదారుల ఆర్థిక పురోభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి చేశారు.

తన జీవితాన్నిబలహీన వర్గాల అభ్యున్నతికి అంకితం చేసిన వ్యక్తి.  నాయకత్వ పటిమ, సమర్థతను బట్టి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి పీఠానికి ముందువరసలో ఉన్నా కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి కాలేకపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించిన సందర్భంలో అసంతృప్తిగా ఉన్న ఆయన 1987లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.హైదరాబాద్‌లో అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో ముఖ్య పాత్ర వహిస్తూ, తెలంగాణలో చేనేత సహకార సంఘాల స్థాపనకు, పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేశారు.

ఆయన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం 2014లో హైదరాబాద్‌లో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. ఆయన పుట్టిన రోజు (సెప్టెంబర్ 27) ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009-12 మధ్య తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, చలిని సైతం లెక్కచేయకుండా 97 సంవత్సరాల వయస్సులో కూడా  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన నిఖార్సైన గొప్ప తెలంగాణవాది బాపూజీ .

అవార్డులు

 1963 హైదరాబాద్ సెంట్రల్ కో ఆపరేటివ్ యూనియన్ వజ్రోత్సవాల సందర్భంగా సహకార రత్న గోల్డ్‌మెడల్, అమెరికా బయోగ్రాఫికల్ ఇనిస్టిట్యూట్ వారి డిస్టింగ్విస్ట్ లీడర్ షిప్ గోల్డ్‌మెడల్ అందుకున్నారు. 2002లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఫిలాంత్రఫి అవార్డు,స్పెయిన్ దేశానికి చెందిన ఆల్బర్ట్ స్విట్టర్ అంతర్జాతీయ ఫౌండేషన్ వారి బంగారు పతకం,ఆస్ట్రేలియా అండ్ ఏసియా సివిల్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్, సిడ్నీ వారి డిస్టింగ్విస్ట్ ఫెలోషిప్ 2010 అవార్డ్ లభించింది. 

బాపూజీలాంటి సామాజిక ఉద్యమ నాయకులు అరుదుగా కనిపిస్తారని చెప్పవచ్చు. సామాజిక ఉద్యమకారులు వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి జిల్లా కేంద్రంలో బాపూజీ విగ్రహాలను నెలకొల్పేందుకు కృషి చేయాలి. ఆయన నివాసస్థలమైన జలదృశ్యాన్ని మ్యూజియంగా మార్చాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వ్యాసకకర్త సెల్ : 9848445134.