calender_icon.png 23 December, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలకు ఆదర్శం బాపూజీ జీవితం

21-09-2024 12:00:00 AM

నేడు కొండా లక్ష్మణ్ వర్ధంతి :

కొండా లక్ష్మణ్ జీవిత కాలం (1915--2012) అంతా కుల, వర్గ ప్రాంతీయ ఆధిపత్యాలకు వ్యతిరేక పోరాటాలతో కొనసాగింది.1940 వ దశకంలో తెలంగాణ జాగీర్దార్, సంస్థానాధీశులు, వతన్‌దార్, దేశ్ ముఖ్, దేశ్ పాండే,ముఖ్తేదార్, ఇనామ్‌దార్, రెడ్డి, వెలమ దొరల నిరంకుశ వెట్టి చాకిరి, ఆర్థిక దోపిడీని ఎదిరించి వృత్తి పనివారలను సంఘటిత పరచడంలో బాపూజీ చేసిన కృషి ఎనలేనిది. బాపూజీ నాడు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తొలిదశ, మలిదశ తెలంగాణోద్యమంలో పాల్గొన్నారు. 1969 మార్చి19న తెలంగాణా కోసం తన మంత్రి పదవిని వదులుకొని నాటి నుండి చివరి శ్వాస వరకు సామాజిక తెలంగాణే లక్ష్యంగా పోరాడిన గొప్ప యోధుడు.

1950లో చేనేత పారిశ్రామిక సహకారోద్యమాన్ని ప్రారంభించి హైకో (హైద్రాబాద్ సెంట్రల్ హ్యాండ్లూమ్ కో ఆపరేటివ్ సోసైటీ)ను స్థాపించి 150 చేనేత సహకార సంఘాలతో లక్షా ముప్పువేల మంది సభ్యులతో చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలిచారు. ఒకటి,రెండు సార్లు ఆయనకు ముఖ్యమంత్రి పదవికి వచ్చిన అవకాశం అగ్ర, ఆధిపత్య కులాల కుట్రలతో తప్పిపోయింది. తొలి బలహీన వర్గాల నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజంలో అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 97ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో బాపూజీ చేసిన దీక్ష తెలంగాణ పోరాట చరిత్రలో లిఖింపదగినది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్లు సాధించడంలో కొండా లక్ష్మణ్  పాత్ర మరువలేనిది. ఈ విషయంలో పుంజాల శివశంకర్‌కు సలహాలు, సూచనలు చేస్త్తూ బిసి రిజర్వేషన్లకు మార్గ దర్శకుడిగానిలిచారు. 1990లో బీపీ మండల్ ఉద్యమం తర్వాత దళిత, ఆదివాసి ఉద్యమాలతో బహుజన రాజకీయ మార్పు మొదలవుతున్న సందర్భంలో తెలుగు ప్రాంతాల్లో బహుజన ఉద్యమాలకు వేదికగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న సంకల్పం బాపూజీలో బలంగా ఉన్నా అది నెరవేలేదు.

బలహీన వర్గాలలో విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టి హైదరాబాద్ లో పద్మశాలీల హాస్టల్ ను స్థాపించి బిసి కులాల గౌడ, కురుమ, భవసాయ క్షత్రియ, గంగపుత్ర, విశ్వకర్మ హాస్టల్స్ స్థాపనకు అండగా నిలిచిన మహోన్నతుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 2012 సెప్టెంబర్ 21న బాపూజీ చివరి శ్వాస విడిచారు. వారి జీవితం నేటి తరాలకు ఆదర్శం. వారి చరిత్రను ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో పొందు పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

చెన్న శ్రీకాంత్ బిసి