calender_icon.png 29 November, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బన్యన్ నేషన్ 200 కోట్ల పెట్టుబడి

29-11-2024 02:23:03 AM

  1. రాష్ట్రంలో కంపెనీ విస్తరణతో 500 మందికి ఉద్యోగాలు
  2. మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

బన్యన్ నేషన్ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో బన్యన్ నేషన్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తోందని, దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోదని చెప్పారు.

విస్తరణ పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను ఈ సంస్థ యూనిలివర్, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోందని తెలిపారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న బన్యన్ నేషన్ లాభాల్లో నడుస్తోందని చెప్పారు.

కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం వారు మరికొంత భూమిని అడుగుతున్నారని, దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, బన్యన్ నేషన్ సీఈవో మణి వాజ్‌పేయ్, సీవోవో రాజ్‌కిరణ్ మదన్‌గోపాల్ పాల్గొన్నారు.