calender_icon.png 9 March, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో నిషేధిత ఉగ్రసంస్థ భారీ ర్యాలీ

08-03-2025 11:54:01 PM

అడ్డుకోవడంలో పోలీసులు విఫలం..

యూనస్ ప్రభుత్వ హయాంలో క్రియాశీలమవుతున్న నిషేధిత ఉగ్రసంస్థలు..

ఢాకా: నిషేధిత ఉగ్రసంస్థ హిబ్జ్ మద్దతుదారులు బంగ్లాదేశ్ రాజధాని, ఢాకాలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, ఇస్లామిక్ ఖలీఫాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘ఖలీఫా, ఖలీఫా’ అంటూ నినాదాలు చేస్తూ,  హిబ్జ్ ఉగ్రసంస్థకు చెందిన వందలాది మద్దతుదారులు ర్యాలీ చేశారు. ఉగ్రసంస్థ మద్దతుదారులు ర్యాలీ తీయబోతున్నారనే ముందస్తు సమాచారంతో గురువారం ఢాకా మెట్రోపాలిట్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాలీలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. పోలీసుల హెచ్చరికను ఏ మాత్రం పట్టించుకోని ఉగ్రసంస్థ మద్దతుదారులు ర్యాలీకి భారీగా తరలివచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వంటివి ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.

మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నిషేధిత ఉగ్రసంస్థలు క్రియాశీలమవుతున్నాయనే విషయం శుక్రవారం నాటి ర్యాలీతో స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 1953లో హిబ్జ్ ఉగ్రసంస్థ జెరూసలేంలో పురుడుపోసుకుంది. కాగా ఈ సంస్థపై షేక్ హసినా ప్రభుత్వం 2009లో నిషేధం విధించింది. భారత్ కూడా ఈ సంస్థపై గత ఏడాది నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో హిబ్జ్ మద్దతుదారులను ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు తిరిగి క్రియాశీలమైతే భారత్‌కు కొంత మేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.