- ఆర్బీఐ పాలసీపై ఫోకస్
- ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 110 పాయింట్లు అప్
ముంబై, డిసెంబర్ 4: రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు అండతో వరుసగా నాలుగో రోజూ బీఎస్‌ఈ సెన్సెక్స్ పెరిగింది. అయితే దక్షిణ కొరియాలో మార్షల్ లా విధింపు, తొలగింపు, యూ ఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రసంగించనున్న కారణంగా ప్రపంచ మార్కెట్లు ఊగిలాడటంతో బుధవారం స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
సెన్సెక్స్ ఇంట్రాడేలో 399 పాయింట్లు జంప్‌చేసి 81,245 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం 80,630 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 110 పాయింట్ల లాభంతో 80,956 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో 24,573-24,375 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకులోనై చివరకు 10 పాయింట్ల స్వల్ప లాభంతో 24,467 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల్ని శుక్రవారం ఉదయం గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడిస్తారు.
ఈ దఫా వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టినా, క్యాష్ రిజర్వ్ రేషియోను (సీఆర్‌ఆర్) ఆర్బీఐ తగ్గింవచ్చన్న అంచనాలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లను జోరుగా కొనుగోలు చేసినట్లు ట్రేడర్లు తెలిపారు. బ్యాంకింగ్‌తో పాటు ఐటీ షేర్లకు సైతం మద్దతు లభించిందన్నారు. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాలు జరిగాయి.
రెండో రోజూ ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) వరుసగా రెండో రోజూ నికర కొనుగోళ్లు జరిపారు. మంగళవారం రూ. 3,664 కోట్ల నిధుల్ని మార్కెట్‌లో పెట్టుబడి చేసిన విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం మరో రూ.1,797 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్న ట్లు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ గెయినర్
సెన్సెక్స్-30 బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1.9 శాతం జంప్ చేసి, రూ.1,860 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, టైటాన్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్‌లు 1.8 శాతం వరకూ లాభపడ్డాయి. భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, మారుతి, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు నష్టాలతో ముగిసాయి.
వివిధ రంగాల సూచీల్లో రియల్టీ ఇండెక్స్ 2.13 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.19 శాతం, బ్యాంకెక్స్ 0.91 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ ఇండెక్స్ 0.72 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.69 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.55 శాతం, ఐటీ ఇండెక్స్ 0.52 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.27 శాతం చొప్పున పెరిగాయి.
టెలికమ్యూనికేషన్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం చొప్పున లాభపడ్డాయి. టెలికమ్యూనికేషన్స్, యుటిలిటీస్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, సర్వీసెస్ సూచీలు నష్టపోయాయి.