సెన్సెక్స్ 694 పాయింట్లు అప్
ముంబై, నవంబర్ 5: సోమవారం తీవ్ర నష్టాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు మంగళవారం నాటకీయంగా రికవరీ అయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా నిస్తేజంగా ట్రేడింగ్ మొదలైనప్పటికీ, మధ్యాహ్న సెషన్ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి, 79,477 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 218 పాయింట్లు పెరిగి కీలకమైన 24,200 పాయింట్ల ఎగువన 24,218 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. సోమవారం సెన్సెక్స్ 900 పాయింట్లకుపైగా, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా తగ్గిన సంగతి తెలిసిందే.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.9 శాతం పెరిగింది. టాటా స్టీల్ 4 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం క్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 2.5 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.
వివిధ రంగాల సూచీల్లో మెటల్ ఇండెక్స్ 2.38 శాతం, బ్యాంకెక్స్ 2.09 శాతం, కమోడిటీస్ 1.84 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.58 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.83 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.81 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.68 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.67 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, టెక్నాలజీ, సర్వీసుల సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం చొప్పున లాభపడ్డాయి.
కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొన సాగుతున్నది. కిత్రం ట్రేడింగ్ రోజైన సోమవారం రూ.4,300 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకోగా, మంగళవారం రూ. 2,569 కోట్ల మేర నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ నెల తొలి రెండు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఫండ్స్ రూ.6,000 కోట్లు ఉపసంహరించుకున్నాయి.