న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో బ్యాంకింగ్ మోసాలు గణనీయంగా పెరిగినట్లు గురువారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా డేటా ప్రకారం ఈ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 18,461 బ్యాంకింగ్ ఫ్రాడ్స్ జరగ్గా, ఈ మోసాల మొత్తం ఎనిమిది రెట్లు పెరిగి రూ.21,367 కోట్లుగా ఉన్నది.
గత ఏడాది ఇదేకాలంలో రూ.2,623 కోట్ల మొత్తంతో కూడిన 14,480 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. బ్యాంకింగ్ మోసాల్లో సంఖ్య రీత్యా 83.5 శాతం ఇంటర్నెట్, కార్డ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. మోసపోయిన మొత్తం రీత్యా చూస్తే ఈ మోసాలు 44.7 శాతం ఉన్నాయి. 2023-24లో నమోదైన బ్యాంకింగ్ మోసాల్లో ప్రైవేటు రంగ బ్యాంక్‌ల్లో 67 శాతం జరిగాయి.
అయితే ఇంటర్నెట్, కార్డ్ మోసాల్లో అధిక మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లోనే నమోదయ్యింది. ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సిస్టమ్స్‌ను పటిష్టపర్చి, డిజిటల్ ఫ్రాడ్స్‌ను నిరోధించేందుకు బ్యాంక్‌లు, చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది.