calender_icon.png 26 December, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్, ఆటో షేర్ల పతనం

08-11-2024 01:19:52 AM

  1. 2 రోజుల మార్కెట్ ర్యాలీకి బ్రేక్
  2. సెన్సెక్స్ 836 పాయింట్లు డౌన్
  3. 24,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఐటీ షేర్లు బుధవారం మార్కెట్‌ను పరుగు తీయించగా, గురువారం బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ షేర్లు వెనక్కు లాగాయి. దీనితో రెండు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 958 పాయింట్లు పతనమై 79,419 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 836 పాయింట్లు నష్టపోయి, 80,000 స్థాయి దిగువన 79,541 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 285 పాయింట్లు తగ్గి కీలకమైన 24,200 పాయింట్ల దిగువన ముగిసింది. సెన్సెక్స్ గత రెండు రోజుల్లో 1,500 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లకుపైగా  పెరిగాయి. 

యూఎస్ ఫెడ్ పాలసీపై ఫోకస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం  ప్రస్తుతం యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, భవిష్యత్తు రేట్ల బాటపై సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని విశ్లేష కులు చెప్పారు. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ భారత కాలమానం ప్రకారం నవంబర్ 7, గురువారం అర్థరాత్రి ఫెడ్ ఫండ్స్ కమిటీ పాలసీ నిర్ణయాల్ని వెల్లడిస్తారు.

ఈ మీట్‌లో మరో పావుశాతం మేర వడ్డీ రేటును తగ్గిస్తారన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, ట్రంప్ విధానాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలతో భవిష్యత్తు వడ్డీ రేట్ల కోతలకు బ్రేక్ వేస్తూ ఫెడ్ సంకేతాలు వెల్లడించవచ్చని ఇన్వె స్టర్లు భావిస్తున్నారని అనలిస్టులు వివరించారు. ఫలితంగా వడ్డీ రేట్లతో ప్రభావిత మయ్యే బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీ రంగాల షేర్లను విక్రయించారని తెలిపారు. 

ఇన్వెస్టర్లు వారి దృష్టిని యూఎస్ ఎన్నికల ఫలితాల నుంచి ఫెడ్ పాలసీవైపు మళ్లించారని, భవిష్యత్తు రేట్ల కోతపై సంకేతాల కోసం వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.  ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ, ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యానాలపై శుక్రవారం మార్కెట్ స్పందిస్తుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 

టాటా మోటార్స్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్, టెక్ మహీంద్రాలు 2.5 శాతం మేర తగ్గాయి. అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2 శాతం వరకూ క్షీణించాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే లాభపడింది. అన్ని రంగాల సూచీలు రెడ్‌లోనే ముగిసాయి. 

అత్యధికంగా మెటల్ ఇండెక్స్  2.54 శాతం తగ్గింది. యుటిలిటీస్ ఇండెక్స్ 2.82 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.65 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.45 శాతం. పవర్ ఇండెక్స్ 1.42 శాతం, ఆటో ఇండెక్స్ 1.40 శాతం  చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.44  శాతం చొప్పున తగ్గాయి. 

మరో రూ. 4,900 కోట్లు తరలింపు 

 దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసా గుతున్నది. గురువారం విదేశీ ఫండ్స్  రూ. 4,888 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా విదేశీ ఫండ్స్ స్టాక్ మార్కెట్ నుంచి అదేపనిగా వెనక్కు తీసుకుంటున్న సంగతి విదితమే.

నవంబర్ నెల తొలి నాలుగు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఫండ్స్ రూ.15,000 కోట్లకు మేర పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నాయి. అక్టోబర్ నెల మొత్తంలో రికార్డుస్థాయిలో రూ. 95,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు.