calender_icon.png 13 October, 2024 | 11:51 PM

బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల ర్యాలీ

21-08-2024 12:30:00 AM

  1. సానుకూల గ్లోబల్ సంకేతాలు 
  2. సెన్సెక్స్ 378 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు అప్

ముంబై, ఆగస్టు 20: సానుకూల గ్లోబల్ సంకేతాలతో భారత స్టాక్ సూచీలు మంగళవారం ర్యాలీ జరిపాయి. తాజా ర్యాలీకి బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు నేతృత్వం వహించాయి.గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒకదశలో 518 పాయింట్లు జంప్‌చేసి 80,942 పాయింట్ల వద్దకు చేరింది. చివరకు 378 పాయింట్ల లాభంతో 80,802 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో వరుసగా నాలుగో రోజు పెరిగిన ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ మరో 126 పాయింట్లు లాభపడి 24,698 పాయింట్ల వద్ద ముగిసింది.

మధ్యప్రాచ్యంలో రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం, క్రూడ్ ధరలు దిగిరావడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని విశ్లేషకులు తెలిపారు. ఇజ్రాయిల్, హమాస్‌ల యుద్ధ విరమణకు చర్చలు జరపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నా రు. సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీ లు రికార్డుస్థాయికి పెరగ్గా, మంగళవారం సియోల్, టోక్యో సూచీలు లాభపడ్డాయి. షాంఘై, హాంకాంగ్‌లు తగ్గాయి. యూరప్ సూచీలు లాభాల్లో ముగిసాయి.  ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతంపైగా తగ్గి 76.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. 

ఫెడ్ మినిట్స్‌పై దృష్టి

రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం, చైనా డిమాండ్ సన్నగిల్లడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు క్షీణించడం కలిసి వచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. త్వరలో వెలువడే జపాన్ ద్రవ్యోల్బ ణం గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ కమిటీ మీటింగ్ మినిట్స్ భవిష్యత్ వడ్డీ రేట్ల దిశను, మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని నాయర్ వివరించారు. బుధవారం వెలువడే ఫెడ్ కమిటీ మినిట్స్ సమీప ట్రెండ్‌కు కీలకమని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.

బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్ 3,25 శాతం పెరిగి రూ.1,552 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మాలు 2.3 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్‌లు 1 శాతం వరకూ తగ్గాయి.

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.19 శాతం పెరిగింది.యుటిలిటీ ఇండెక్స్ 1.07 శాతం పుంజుకుంది. పవర్ ఇండెక్స్ 0.80 శాతం పెరగ్గా, ఐటీ ఇండెక్స్ 0.76 శాతం పుంజుకుంది. ఆటోమొబైల్ ఇండెక్స్ 0.75 శాతం ఎగిసింది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున పెరిగాయి.