మూడు వారాల క్రితం రాయపర్తి ఎస్బీఐలో 19 కిలోల బంగారం చోరీ
2 కిలోల 520 గ్రాములు రికవరీ
జనగామ, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మూడు వారాల క్రితం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లాలోని రాయ పర్తి బ్యాంకు దోపిడీ నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితుల చోరీ చేయగా.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల కు చెందిన అర్షాద్ అన్సానీ, షాకీర్‌ఖాన్, హిమాన్షు బిగాంచండ్ జాన్వర్, నవాబ్ హాసన్, అక్షయ్ గజనాన్, సాగర్ భాస్కర్ గోర్, సాజిద్ ఖాన్ ఏడుగురు ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో రాయపర్తి ఎస్బీఐలో చోరీకి పాల్పడ్డారు. ఇందులో అన్సానీ, షాకీర్‌ఖాన్, హిమాన్షు పట్టుబడ్డారు.
గూగుల్‌లో బ్యాంకును వెతికి..
పరారీలో ఉన్న మహ్మద్ నవాబ్ హాసన్ ఈ చోరీలో కీలక పాత్ర పోషించాడు. యూ పీకి చెందిన నవాబ్ హాసన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణకు వచ్చి మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకులపై ఆరా తీశాడు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐలో భద్రత లేనట్లు తెలిసింది. మరో ఆరుగురితో కలిసి ప్రణాళిక రచించాడు. గూగుల్‌లో ఆ బ్యాంకు రూట్‌మ్యాప్‌ను పరిశీలించి దోపిడీకి స్కెచ్ వేశారు. అప్పటికే హైదరాబాద్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం వేసిన ఈ ముఠా నవంబర్ 28న కారులో అర్ధరాత్రి రాయపర్తి బ్యాంకు వద్దకు వచ్చారు.
కిటికీని తొలగించి లోపలికి వెళ్లగానే బ్యాంకు అలారం, సీసీ కెమెరాల వైర్లు తొలగించి పని కానిచ్చారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో స్ట్రాంగ్ రూంలో ఉన్న మూడు లాకర్లను తొలగించి అందులో ఉన్న సుమారు రూ.14 కోట్ల విలువైన 19 కిలోల బంగారాన్ని అపహరించారు. తిరిగి వారు వచ్చిన కారులోనే హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడి నుంచి యూపీ, మహారాష్ట్రకు పరారయ్యారు. పోలీసు శాఖ నిందితులను పట్టుకునేందుకు ఎంతగానో శ్రమించింది.
వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా దొంగలను పట్టుకునేందుకు పది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమ హేంద్రనాయక్ నేతృత్వం వహించారు. వీరంతా చాకచక్యంగా వ్యవహరించి శుక్రవా రం ముగ్గురిని పట్టుకున్నారు. నలుగురి కోసం వెతుకుతున్నారు. నిందితుల నుంచి రూ.కోటి 85 లక్షల విలువైన 2 కిలోల 520 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు.