calender_icon.png 10 March, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు డ్రైవర్‌పై బ్యాంకు ఉద్యోగి దాడి

11-12-2024 02:11:43 AM

  1. డ్రైవర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
  2. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదుతో డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించిన ఆర్టీసీ అధికారులు
  3. సిద్దెపేట డిపో ఎదుట అద్దెబస్సుల నిలిపివేత

సిద్దిపేట, డిసెంబర్ 10 (విజయక్రాంతి): సిద్దిపేట ఆర్టీసీలో కొనసాగుతున్న అద్దెబస్సుల సేవలు మంగళవారం నిలిచిపోయా యి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు ఈనెల 6న సిద్దిపేట- నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని బస్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులను పికప్ చేసుకుని బయలుదేరింది.

అదే గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగికి బస్సు మిస్ అయ్యింది. దాంతో ఆ ఉద్యోగి బైక్ సహాయంతో సమీప గ్రామమైన లింగన్నపేట వరకు వచ్చి అక్కడ బస్సు ఎక్కాడు. బస్సు 120పైగా ప్రయాణికులతో సిద్దిపేట మాడ్రన్ బస్టాప్‌కు చేరుకుంది. ప్రయాణికులు అందరు దిగిపోయె వరకు వేచిచూసిన సదరు బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్.. డ్రైవర్‌పై బూతులు తిడుతూ, దాడి చేశాడు. అక్కడే ఉన్న కండక్టర్ ఉద్యోగిని అదుపు చేశాడు.

ఆనంతరం బ్యాంకు ఉద్యోగి ఫోన్ ద్వారా ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేశారు. 7వ తేదీ శనివారం విధులకు వెళ్లిన అద్దె బస్సు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు అతడికి ఆర్టీసీ అధికారులు తెలిపారు. బ్యాంకు ఉద్యోగినే అకారణంగా తనను దూషించి దాడిచేసినప్పటికీ.. తనను విధులోంచి తొలగించడం దారుణమని అతడు వాపోయాడు. దీంతో అదే రోజు బ్యాంకు ఉద్యోగిపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారాని డ్రైవర్ ఆరోపించాడు. ఈ విషయం తన తోటి అద్దె బస్సు డ్రైవర్లకు వివరించగా అందరూ కలిసి మంగళవారం సమ్మెకు దిగారు. విధుల నుంచి తొలగించిన డ్రైవర్ రేపాక నవీన్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు దాడిచేసిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌పై పోలీసుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.