calender_icon.png 21 December, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా కళ భళా

16-10-2024 12:00:00 AM

కాలం మారుతున్నా.. ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్నా.. నేటికీ బంజార కళ ఆకట్టుకుంటోంది. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌గర్, ఆదిలాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో బంజారులున్నారు. ఒకప్పటి లాంబాడీలే నేడు బంజారుగా పిలువబడుతున్నారు. అయితే బంజార మహిళల దుస్తుల ప్రదర్శన ఇతర మహిళలకు చాలా భిన్నంగా ఉంటుంది. రంగురంగుల గాగ్రాలు, చోళీలు, అద్దాలు ఆప్లిక్ వర్క్‌లతో డిజైన్ చేసిన బట్టలు వేసుకుంటూ తమ కళను కాపాడుకుంటున్నారు.

ఆధునిక ఫ్యాషన్ ఆకట్టుకుంటున్నా.. పూసలు, గుండ్లు, అద్దాలతో కూడిన ఎంబ్రాయిడరీ దుస్తులు వాడుతూ లంబాడ కళకు వన్నె తీసుకొస్తున్నారు. ఎంబ్రాయిడరీలో నాణేలు, ఉన్ని కుచ్చులు, కౌరీ షెల్స్, కాటన్ కూడా వాడతారు. ఎంబ్రాయిడరీ ద్వారా బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, పిల్లో కవర్లు, క్విల్ట్‌లు, బెడ్ స్ప్రెడ్లు, స్కర్ట్, సల్వార్ సూట్, బ్లౌజ్లు కూడా వాడుతూ తమ ములాలను గుర్తుచేస్తున్నారు.

అయితే రంగురంగుల గాగ్రా చోళీలతో 23 కుట్లు వేసిన ఎంబ్రాయిడరీ బంజార మహిళల ప్రధాన వస్త్రధారణ. బంజార మహిళ కళాకారులు తమ నైపుణ్యంతో చిన్న చిన్న ఫ్యాబ్రిక్‌తో ఈ అద్భుతమైన ఎంబ్రాయిడరీని తయారుచేస్తారు. చిన్న చిన్న అద్దాల ముక్కలను వస్త్రంలో కలుపు తారు. ఇది మరింత మెరుపును తీసుకొస్తుంది. డిజైన్ చేసే క్రమంలో రెండు వారాలపాటు కష్టపడుతంటారు.

ఈ కళాఖండంలో ఏ వస్త్రం కూడా వృథా కాదంటే వారి నైపుణ్యం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పట్టణ మహిళలు బంజార వస్త్రధారణకు దూరంగా ఉంటున్నా.. తండాల్లో, మారుమూల గిరిజిన గ్రామాల్లో నివసించే మహిళలు వాడుతూ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. అంతేకాదు.. వాటికి సంబంధించిన అల్లికలను ఇతరులకు నేర్పిస్తూ భావితరాలకు వారసత్వంగా అందిస్తున్నారు. 

నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో లంబాడీల జనాభా ఎక్కువ. ఈ కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేకమైన ఆభరణాలను రూపొందించి తయారు చేస్తోం ది దేవరకొండలోని రంగ్రీజు బజారు. అక్కడ అడుగు పెడితేచాలు బంజారులకు సంబంధించిన అనేక దుస్తులు, అల్లికలు లభ్యమవుతాయి. దాదాపు 20 కుటుంబాల వరకు ఇదే పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. 

‘మేము తరతరాలుగా ఆభరణాలను డిజైన్ చేస్తున్నాం. ఈ కళను మా పెద్దవారి నుంచి నేర్చుకున్నాం. ఇది మా సంప్రదా యం. ఒకప్పుడు లేపాక్షి హస్తకళల్లో పనిచేసేవాళ్లం, ఇప్పుడు గోల్కొండ హస్తకళల కింద పనిచేస్తున్నాం. ’ట్రైబ్స్ ఆఫ్ ఇండియా’ కూడా మూడేళ్లుగా మా పనికి మద్దతు ఇస్తోందని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నాం” అని కళాకారులు చెబుతున్నారు. 

అయితే బంజారాలు మొదట రాజస్థాన్ వలస వచ్చిన సంచార తెగలు. కాలక్రమేణా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అనేక రాష్ట్రాలలో ఉన్నారు. చరిత్ర ప్రకారం.. వారు దక్షిణ భారతదేశానికి వస్తువులను రవాణా చేయడం ద్వారా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సహాయం చేసినట్లు భావిస్తారు. కష్టపడేతత్వం, ఆత్మగౌరవం ఉన్న బంజారాలు బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని కూడా పేరుంది.

“ఎంబ్రాయిడరీ అనేది మా సంప్రదాయం మాత్రమే కాదు, ఆచా రాలు, సంప్రదాయాల్లో ఒక భాగం. మేం తయారు చేసే డిజైన్లకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సవాళ్లు ఉన్నప్పటికీ మేం ఈ కళను వదులుకోవడానికి ఇష్టపడం” అని అంటా రు ఈతరం కళాకారులు.  

ఇది మా కల్చర్

బంజార కల్చర్ చాలా గొప్పదని మేం భావిస్తాం. చిన్నప్నట్నుంచే బంజారకు సంబంధించిన దుస్తులు వేసుకుంటున్నా. ఇండియాలో ఇలాంటి కల్చర్ లేదని నా అభిప్రాయం. మా చేతులతో మేమే అల్లుకొని ఎంబ్రాయిడరీ తయారుచేసుకుంటాం. తీజ్ పండుగల సమయంలో బంజార దుస్తులు వేసుకొని డాన్సులు చేస్తాం. బంజార ఎంబ్రాడయిరీ వేసుకుంటే దుర్గమాతలా ఫీల్ అవుతా. దసరా, దుర్గమాత సమయంలో కచ్చితంగా బంజార వస్త్రాధారణే ఇష్టపడుతా. ప్రస్తుతం కొత్త ఫ్యాషన్ దుస్తులున్నా.. పెళ్లిల్లో మా దుస్తులనే ధరిస్తాం. 

 నేనావత్ హరిత, డిచ్‌పల్లి, కామారెడ్డి