calender_icon.png 16 April, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా మోడల్ మేఘనా అరెస్ట్

15-04-2025 11:41:02 PM

దౌత్యవేత్తతో సంబంధాల నేపథ్యంలో స్పెషల్ యాక్ట్ ప్రయోగం..

ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన మేఘనా ఆలంను ఈ నెల 9వ తేదీన ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ పవర్స్ యాక్ట్ ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకోగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె సౌదీ దౌత్యవేత్తతో సంబంధాలు నెరుపుతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నది. వారిద్దరికి సంబంధించి అనేక పోస్ట్‌లు బంగ్లాలో కలకలం రేపాయి. మేఘనా కారణంగా దేశ దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని అక్కడి ప్రసార మాధ్యమాల్లో విరివిగా కథనాలు ప్రసారమయ్యాయి.

దీంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై చర్యలకు పూనుకున్నది. ఢాకా కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులు ఆమెను కాషింపూర్ జైలుకు 30 రోజుల రిమాండ్‌కు తరలించారు. మేఘనా అరెస్ట్‌తో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. తాత్కాలిక ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా మేఘనా ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్ట్ చేశారని, తాను అన్ని విధాలుగా సహకరిస్తానని ఆమె వేడుకున్నా అనుచితంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. మేఘనా అరెస్ట్‌పై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.