ఢాకా: బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ పార్టీలతో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ చర్చలు జరిపారు. చర్చల తర్వాత బంగ్లాలో సైనిక పాలన విధించినట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఆందోళనకారులు బంగ్లాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ చీఫ్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ఆందోళన కారులు ముట్టడించారు. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల్లో ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోగా మొత్తంగా 300 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్ అత్యంత ఘోరమైన రోజులను చూసిన తర్వాత ప్రధాని షేక్ హసీనా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి దేశాన్ని ఆర్మీ నడిపిస్తుందని ఆర్మీ చీఫ్ చెప్పారు.