calender_icon.png 7 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్రిక్తంగానే బంగ్లాదేశ్

07-08-2024 02:26:52 AM

పరిస్థితులు చక్కదిద్దేందుకు సైన్యం యత్నం

కొత్త సర్కారు ఏర్పాటుపై అధ్యక్షుడి చర్చలు

యూనస్ నాయకత్వాన్ని కోరుతున్న విద్యార్థులు

భారత్‌లోనూ బంగ్లాదేశ్ ప్రకంపనలు

కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇంతటి సంక్షోభాన్ని ఊహించలేదన్న విదేశాంగమంత్రి

హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ అనాసక్తి

మరికొంతకాలం భారత్‌లోనే ఉండనున్న హసీనా

న్యూఢిల్లీ/ఢాకా, ఆగస్టు 6: పౌర తిరుగుబాటుతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశాధ్యక్షుడితోపాటు సైన్యం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అల్లరిమూలను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించారు. సోమవారం రాజధాని ఢాకాకు లాంగ్‌మార్చ్ నిర్వహించిన ఆందోళనకారులు ప్రధాని షేక్‌హసీనా దేశం విడిచి పారిపోవటంతో తిరుగుముఖం పట్టారు.

దీంతో దేశంలో పాలనను గాడిలో పెట్టేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్ త్రివిధ దళాల అధిపతులు, పౌర నాయకులతో సమావేశమయ్యారు. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ పరిణామాలన్నింటికి కారణమైన విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం సైన్యాధ్యక్షుడిని కలిసి కొత్త ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం లేకపోతే ఒప్పుకోబోమని అల్టిమేటం జారీచేశారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం భారత్‌ను కూడా కుదిపేస్తున్నది. మోదీ ప్రభుత్వ ఘోర దౌత్య వైఫల్యానికి ఈ సంక్షోభం ఒక ఉదాహరణ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మంగళవారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి తాజా పరిస్థితిని వివరించింది. బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల కుట్రలను తోసిపుచ్చలేమని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పార్లమెంటులోనూ ఆయన ఈ అంశంపై ప్రకటన చేశారు.

కాగా, భారత్‌లో ఉన్న షేక్‌హసీనాకు ఆశ్రయం ఇచ్చే అంశంపై బ్రిటన్ సానుకూలంగా స్పందించలేదు. ఇతర దేశాల రాజకీయ నాయకులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించే నిబంధనలు ఏవీ తమ చట్టాల్లో లేవని ఆ దేశం ప్రకటించింది. దీంతో బంగ్లా మాజీ ప్రధాని మరికొంతకాలం భారత్‌లోనే ఉండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.