26-03-2025 12:12:10 AM
ఉన్నతాధికారులతో ఆర్మీ చీఫ్ జనరల్ అత్యవసర సమావేశం..
యూనస్‌ను గద్దె దించడమే లక్ష్యం..
జాతీయ ఐక్యతా ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు..
తాత్కాలిక ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తే కారణం..
వార్తలను తోసిపుచ్చిన సైన్యం..
ఢాకా: బంగ్లాదేశ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన తీసుకురావడానికి ఆ దేశ ఆర్మీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ యూనస్‌ను త్వరలోనే తొలగించి, సైన్యం నియంత్రణ చేపట్టే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్‌తో సహా ఉన్నత శ్రేణి ఆర్మీ అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆర్మీ అధికారులు బంగ్లాలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో బంగ్లాలో సైనిక పాలనను తీసుకొచ్చి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని అక్కడి ఆర్మీ భావిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించమని సైన్యం యూనస్‌పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తన పర్యవేక్షణలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని ఆర్మీ పరిశీలిస్తోంది. ఇటీవల కాలంలో చాలా రాజకీయ పార్టీలు, విద్యార్థి నాయకులు బంగ్లా ఆర్మీకి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఇది అక్కడి ఆర్మీ అధికారులను కలవరపాటుకు గురి చేసింది. ఈ క్రమంలోనే నిరసనకారులను నియంత్రించడం కోసం ప్రణాళిక రూపొందించేందుకు ఆర్మీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలోనే యూనస్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. చైనా బంగ్లాల మధ్య సంబంధాల్లో మార్పునకు ఈ పర్యటన దోహదపడుతుందని ఢాకా అధికారులు భావిస్తున్నారు.
వార్తలను ఖండించిన ఆర్మీ..
బంగ్లాలో సైనిక పాలన రాబోతుందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ సహా ఇతర ఉన్నతాధికారులు ఖండించారు. అయినప్పటికీ బంగ్లాలోని పరిస్థితులను చూస్తే బంగ్లాదేశ్ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని దింపేసిన విద్యార్థి నాయకులు నేషనల్ సిటిజన్స్ (ఎన్‌సీపీ) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో బంగ్లాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా అవామీ లీగ్ పార్టీ మళ్లీ పుంజుకుని తాత్కాలిక ప్రభుత్వ వైఫల్యాలపై తన గళాన్ని వినిపిస్తోంది. ఇదే సమయంలో బంగ్లాలో తీవ్రవాద శక్తులు మళ్లీ క్రియాశీలం అయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి పాకిస్థాన్‌తో సత్సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఆర్మీ అధికారిపై బంగ్లా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా ప్రజల్లో తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బంగ్లాలో యూనస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆర్మీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారంటూ నివేదికలు వచ్చాయి. వీటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తే బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షభం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.