calender_icon.png 14 March, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లోల బంగ్లా

19-02-2025 12:00:00 AM

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్‌లో ఆశ్రయం పొం దుతున్న విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల్లో అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడంతో హింసాకాండ చల్లారుతుందని అందరూ భావించారు. అయితే హసీనా దేశాన్ని వదిలిపెట్టినప్పటికీ ఆమెపైన, ఆమె ప్రభుత్వంలోని నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై వందల సంఖ్య లో కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పటికే హసీనాకు అరెస్టు వారెంట్ జారీ చేయడమే కాకుండా ఆమెను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ను కోర డం జరిగింది. మరోవైపు దేశంలోని మైనారిటీ హిందువులపైన, ఇస్కాన్ ప్రార్థనా మందిరాలపైన, భక్తులపైనా పెద్దఎత్తున దాడులు కొనసాగాయి. పలు ఆలయాలకు నిప్పుపెట్టారు కూడా. ఈ ఘటనలపై మన దేశంలోని ఆర్‌ఎస్‌ఎస్ లాంటి హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేసినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సంయమనం కోల్పోలేదు.

దేశంలో శాంతి భద్రతలు కాపాడాలని, మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ తాత్కాలిక ప్రభుత్వానికి దౌత్యపరంగా సూచించి, అది ఆ దేశ ఆంతరంగిక సమస్యగానే పరిగ ణించింది. ప్రస్తుతం అక్కడున్నది తాత్కాలిక ప్రభుత్వమే అయినందున పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడేదాకా వేచి చూడాలనుకుంది. అయితే భార త ప్రభుత్వ ఈ మెతక వైఖరి అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి, ముఖ్యంగా అందులో భాగంగా ఉన్న తీవ్రవాద విద్యార్థి సంఘాల నాయకులకు అలుసుగా మారింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయినా ఇప్పటికీ అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి రాలేదు.

తాజాగా. దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను, చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారే లక్ష్యంగా ‘ఆపరేషన్ డెవిల్ హంట్ ’ పేరుతో  కొత్త ఆపరేషన్‌ను చేపట్టింది. చెబుతున్నది ఏమైనా వాస్తవానికి హసీనా ప్రభుత్వంలో పని చేసిన నేతలు, అధికారులే లక్ష్యంగా ఇది సాగుతోంది. హసీనా ప్రభుత్వంలో పని చేసిన 41 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారన్న సాకుతో వెయ్యిమందికి పైగా పోలీసు అధికారులను, సిబ్బందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. మరోవైపు దాదాపు 3 వేల మంది హసీనా పార్టీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. కాగా గత ఆరునెలల కాలంలో అవామీ పార్టీకి చెందిన వందలాది మంది హత్యకు గురయ్యారు. వారి వివరాలు తెలియవు.

అందుకే పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని,  తాను త్వరలోనే బంగ్లాదేశ్ వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని హసీనా ప్రతిన బూనారు. అవామీ లీగ్ కార్యకర్తలు ఏర్పాటు చేసినఓ సమావేశంలో జూమ్‌కాల్‌ద్వారా హసీనా మాట్లాడుతూ యూనస్‌ను ఓ ఉగ్రవాదిగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజల భద్రత ప్రమాదంలో ఉందని కూడా ఆమె అన్నారు. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అయితే హసీనా ఇంత తీవ్రస్థాయిలో యూనస్ ప్రభుత్వంపై విరుచుకు పడడానికి కారణమేమిటి?  పరిస్థితి అంత దారుణంగా ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాలు ప్రధానంగా అవామీ లీగ్, మరో మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీల మధ్య పోరుగానే సాగుతున్నాయి. హసీనా భారత్‌కు అనుకూలమైన నేత కాగా ఖలీదా జియా పార్టీ భారత వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. ఈ రెండుపార్టీల మధ్య ఆధిపత్య పోరే ప్రస్తుత కల్లోలానికి ప్రధాన కారణం. దీనికి జమాతే ఇస్లామీ లాంటి మతతత్వ శక్తులు కూడా తోడవుతున్నాయి. ఫలితంగా మొదటినుంచీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ముస్లిం దేశం ఇప్పుడు మళ్లీ మత ఛాందసవాదుల చేతుల్లోకి పోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.